అనంతపురం, ఫిబ్రవరి 22,
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లో అమ్మాయిల సంఖ్య రోజు రోజుకి తగ్గుతోంది. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకూ బర్త్ రేషియో పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 902 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అమ్మాయిల సంఖ్య తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి.మారినా కానీ కొన్ని కుటుంబాలలో మార్పు రావడంలేదు. ఇప్పటికీ అమ్మాయిలంటే చిన్నచూపు చూస్తున్నారు. మగవారికి ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇంట్లో ఇప్పటికే ఒక ఆడపిల్ల ఉంటే మరో ఆడపిల్ల పుట్టడానికి ఇష్టపడటం లేదు. బలవంతంగా అబార్షన్లు చేస్తున్నారు. దీనివల్ల అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా అమ్మాయిలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మరిన్ని కఠిన నియమాలు అమలు చేస్తే కానీ ఏమైనా మార్పులు కనిపించవని నిపుణులు భావిస్తున్నారు.రాష్ట్ర స్థాయిలో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తి చూస్తే ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 937 మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా చివరిస్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 902 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దాదాపుగా 100 మంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నారు. కర్నూల్ జిల్లాలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 908 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. ఇంచుమించు ఇది కూడా అనంతపురం పరిస్థితే. చిత్తూరు జిల్లాలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 924 మంది అమ్మాయిలు ఉన్నారు. అలగే కడప జిల్లాలో ప్రతి 1000 మందికి 925 మంది అమ్మాయిలు ఉన్నారు.