విజయవాడ, ఫిబ్రవరి 22,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక క్షేత్ర స్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పార్టీని యాక్టివ్ చేయడానికి ఆయన తొలుత జిల్లాల పర్యటనను చేయాలని భావిస్తున్నారు. తొలుత తన సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచే పర్యటన ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజలపై వేసిన పన్నులు, రాజధాని తరలింపు వంటి అంశాలను నేరుగా ప్రజలతో చెప్పేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు గత రెండేళ్లుగా పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. కరోనా తీవ్రత ఒక కారణం. కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నందున ఆయన పర్యటనలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ ఆంక్షలు ఎత్తి వేయడంతో జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. జిల్లాల పర్యటనలకు ముందే ఆయన సమీక్షలు ప్రారంభించారు. ఇన్ ఛార్జిలు లేని నియోజకవర్గాలకు నియామకాలు చేపడుతున్నారు. కొన్ని క్లిష్టమైన నియోజకవర్గాలు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను తన పర్యటనలోగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే జిల్లాల నేతలతో నిత్యం సమీక్షలు చేస్తున్నారు. తొలుత సమీక్షలతో నేతలను యాక్టివ్ చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన వెంటనే చంద్రబాబు జిల్లా టూర్లు ప్రారంభమవుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బహిరంగ సభలా? రోడ్ షో లా? అన్నది ఇంకా నిర్ణయించలేదని, అక్కడి పరిస్థితులను బట్టి సభలను ఏర్పాటు చేయడానికి పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జులకు ఈ సమాచారం చేరింది. దీంతో చంద్రబాబు ఎప్పుడు పర్యటనకు వచ్చినా విజయవంతం చేసేందుకు నేతలు రెడీ అయిపోతున్నారు.