ముంబై, ఫిబ్రవరి 22,
రష్యా-ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే, అనేక దేశాలపై ఎఫెక్ట్ పడనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యాయుద్ధంతో మనం ఇంట్లో వాడే వంటనూనే రేట్లు పెరగనున్నాయి. మన దేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తి చాలా తక్కువ. భారతదేశంలో ఉత్పత్తయిన ఆయిల్ కేవలం 10 శాతం జనాభాకి మాత్రమే సరిపోతుంది. అందుకే ఎక్కువగా ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా నుంచి మనం వంట నూనెలను దిగుమతి చేసుకుంటుంటాం. 2021లో మన దేశం దాదాపు 74శాతం సన్‌ఫ్లవర్ఆయిల్‌ను ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకుంది. అంతేకాకుండా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడంలో మొదటి స్థానంలో ఉంది భారత్. మన దగ్గర పామ్ ఆయిల్ తరువాత ఎక్కువగా వాడేది సన్ ఫ్లవర్ ఆయిల్ కావడం గమనార్హం. అందుకే చాలా వరకు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అయితే.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే, ఒక్క భారతదేశం మాత్రమే కాదు, చాలా దేశాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అందుకే వీలైనంత వరకు యుద్ధం జరగకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాయి పలు దేశాలు.ఈ క్రమంలో ఆయిల్ ధరలు ఇప్పటికే పరిగాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సరఫరా కొరత నేపథ్యంలో ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్‌ల ధరలు 15 లీటర్ల క్యాన్‌కు కనీసం రూ.100, రూ.150 వరకు పెరిగిందని పూణే గుల్తెక్డి మార్కెట్ యార్డ్‌లోని వ్యాపారులు తెలిపారు. అయితే.. భారతదేశం 2020-21లో దాదాపు 63% అంతర్గత రవాణాతో… వంట నూనె దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతుంది. అంతర్జాతీయ సరఫరాదారుల నుంచి నూనె సరఫరా కొరత కారణంగా ధరలపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.