హైదరాబాద్, ఫిబ్రవరి 22,
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. అందుకు తగ్గట్లే మెరుగైన ఫలితాలు వెలువడుతుండడంతో మరికొన్ని దేశీయ వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కరోనా మహమ్మారి బారి నుంచి పిల్లలను రక్షించడానికి మరో టీకా అందుబాటులోకి వచ్చింది. 12 నుంచి 18 మధ్య వయసు పిల్లలకు ఇచ్చేందుకు గాను బయోలాజికల్-ఇ (BE) రూపొందించిన కోర్బెవాక్స్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) పరిమితులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. కాగా ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లల కోసం భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. దేశవ్యాప్తంగా జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి ఈ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. అయితే15 ఏళ్ల లోపు వారికి ఇచ్చే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.కాగా15-18 వయసు చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి రెండో, మూడో దశ ట్రయల్స్ నిర్వహించేందుకు గతేడాది సెప్టెంబర్‌లో బయోలాజికల్-ఇ సంస్థకు అనుమతులు లుభించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న రెండో, మూడో దశ ట్రయల్స్ మధ్యంతర ఫలితాల ఆధారంగా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినట్లు బయోలాజికల్-ఇ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల చెప్పుకొచ్చారు. ‘ కరోనాకు వ్యతిరేకంగా మా పోరాటంలోనే భాగంగా ఈ టీకాను రూపొందించాం. మన దేశంలోని 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ని పంపిణీ చేయవచ్చు. పూర్తిగా టీకాలు వేసిన తర్వాత, పిల్లలు ఎలాంటి భయం లేకుండా పాఠశాలలు, కళాశాలకు వెళ్లవచ్చు. టీకా తయారీకి, క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు’ అని మహిమా చెప్పుకొచ్చారు. కాగా కొవాగ్జిన్ మాదిరిగానే కోర్బెవాక్స్‌ను రెండు డోసుల్లో పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ని నిర్ణయించారు. అయితే పెద్దలకు కూడా పంపిణీ చేసేందుకు ఈ కొవిడ్ వ్యాక్సిన్‌కు గతేడాది డిసెంబర్ 28నే అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. అయితే కొన్ని కారణాల రీత్యా వ్యాక్సినేషన్ ప్రక్రియలో మాత్రం చేర్చలేదు.