హైదరాబాద్, ఫిబ్రవరి 22,
కేసీఆర్ ముంబై పోయిండు. ఉద్దవ్ ఠాక్రేను కలిసిండు. శరద్ పవార్‌తోనూ ముచ్చట పెట్టిండు. శివసేన, ఎన్సీపీలతో మిలాఖత్ అని చెప్పిండు. అందరికీ బైబై చెప్పేసి వచ్చేసిండు. కట్ చేస్తే.. మర్నాడే శివసేన కీలక నేత సంజయ్ రౌత్ నుంచి కంగుతినే మెసేజ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎలాంటి కూటమి ఏర్పాటుకు చర్చలు జరిపేది లేదని తేల్చేశారు. కాంగ్రెస్‌తో పాటే బీజేపీపై పోరాటానికి వెళ్లాలన్నది తమ సిద్దాంతమని శివసేన స్పష్టం చేసింది. సంజయ్ రౌత్ నుంచి వచ్చిన ఈ స్టేట్‌మెంట్ కేసీఆర్‌కు ఇబ్బందికరమే. గులాబీ బాస్.. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌పై ఏకకాలంలో పోరాడాలని చూస్తున్నారు. ఇన్నేళ్ల దేశ దుస్థితికి ఆ రెండు పార్టీలే కారణమంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అందుకే, బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ, కేసీఆర్ ఎక్కడికి వెళితే అక్కడ.. ఆయనకు జై కాంగ్రెస్ స్లోగన్సే వినిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా, ముంబై పర్యటనలోనూ అదే జరిగింది. శివసేన కానీ, ఎన్సీపీ కానీ.. కాంగ్రెస్ లేని కూటమికి తాము వ్యతిరేకమని తేల్చి చెబుతున్నాయి. మహారాష్ట్ర అనే కాదు.. ఇటీవల తమిళనాడు పర్యటనలోనూ సేమ్ సీన్. కేసీఆర్-స్టాలిన్‌ల భేటీలోనూ ఇదే ప్రస్తావన. కాంగ్రెస్ రహిత కూటమికి తామంత ఇంట్రెస్టెడ్ కాదని స్టాలిన్ సైతం సెలవిచ్చారు. చేసేది లేక కేసీఆర్ తిరిగొచ్చేశారు. ఒక్క బెంగాల్ దీదీ మమతా బెనర్జీ ఒక్కరే.. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ అంటూ కేసీఆర్‌కు కోరస్ కలుపుతున్నారు. కుదిరితే.. తానే ప్రధాని పీఠంపై కూర్చోవాలనేది ఆమె ప్రయత్నం. ఈ విషయాలన్నీ తెలిసే.. ఇటీవల కేసీఆర్ స్ట్రాటజీ మార్చేశారా? అనే డౌట్ వస్తోంది. రాహుల్‌గాంధీపై అసోం సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కేసీఆర్. ఆ ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్‌ను ఒక్కమాట కూడా అనలేదు గులాబీ బాస్. ఇక, గాంధీ కుటుంబం దేశం కోసం పలు త్యాగాలు చేసిందంటూ పొగిడారు కూడా. అంటే, కాంగ్రెస్ విషయంలో కేసీఆర్ న్యూట్రల్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా?ఇక, కేసీఆర్ కలుస్తున్న నేతలంతా కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉంటున్నవారే. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీతో పాటు కాంగ్రెస్ సైతం భాగస్వామిగా ఉంది. అటు, తమిళనాడులోనూ డీఎంకే-కాంగ్రెస్ పొత్తు కొనసాగుతోంది. అలాంటిది.. కాంగ్రెస్‌తో ఫ్రెండ్‌షిప్ ఉన్న పార్టీల దగ్గరికి వెళ్లి నాన్ కాంగ్రెస్ కూటమి గురించి మాట్లాడేటంత అమాయకుడేమీ కాదు కేసీఆర్. అంటే, గులాబీ బాస్ కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచించే.. యాంటీ బీజేపీ ఫ్రంట్ కోసం ట్రై చేస్తున్నారు. కొత్త కూటమిలో కాంగ్రెస్ ఉన్నా.. లేకున్నా.. కేసీఆర్ ఓకే అంటున్నారు. అవసరమైతే కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జట్టు కట్టేందుకూ సిద్ధమవుతున్నారా? అందుకేనా, హస్తం పార్టీతో టైఅప్ ఉన్న పార్టీలతోనే చర్చలు జరుపుతున్నారా? లేదంటే... రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నట్టు.. ఇదంతా కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు.. బీజేపీకి లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఆడుతున్నా పొలిటికల్ డ్రామానా?