హైదరాబాద్ ఫిబ్రవరి 22,
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతేడాది ఆగస్టు నుంచి పీఆర్సీ అమలు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించినా జీహెచ్ఎంసీలో మాత్రం నేటికీ 50 శాతానికిపైగా ఉద్యోగులకు పీఆర్సీ రావడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులను అడుగుతున్నా సరైన సమాధానం చెప్పడం లేదు. ఎప్పటి నుంచి ఇస్తారన్న విషయంపై కూడా క్లారిటీ ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా శాఖల ఉద్యోగులకు ఇస్తున్నా.. తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. సర్కిల్, జోనల్ స్థాయిలో ఫైళ్లను మూవ్ చేయకపోవడంతోనే ఉద్యోగులకు పీఆర్సీ అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. అదేవిధంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేస్తామని అసెంబ్లీలో గతేడాది మార్చిలో సీఎం కేసీఆర్ ప్రకటించినా అది కూడా అమలు కాలేదు. ప్రభుత్వం చెప్పినట్లుగా పర్మినెంట్ ఉద్యోగులతో పాటుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ అందడం లేదు. ఈ విషయంపై కమిషనర్ ని వివరణ అడిగేందుకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. కింది స్థాయి అధికారులను అడిగితే ట్రాన్స్ ఫర్స్ కారణంగా ఆలస్యమవుతున్నట్లు చెబుతున్నారు. బల్దియాలో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందకుండా పోతున్నాయని కార్మికులు వాపోతున్నారు. రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికులకు, డ్రైవర్లు తదితరులకు పీఆర్సీ అందడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులను కార్మిక సంఘాల నేతలు అడిగితే వారికి పీఆర్సీ అమలుకు ముందే వేతనాలు పెరిగాయని, అందుకే వర్తించడం లేదనే సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. 26 వేల మందిలో కేవలం ఐదారు వేల మందికి మాత్రమే పీఆర్సీ అందుతున్నట్లు సమాచారం. ఇక తమ గోడును పట్టించుకునేవారే లేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా సీఎం చెప్పినా, జీవో వచ్చినా పీఆర్సీ రాకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 18 వేల మంది పారిశుధ్య కార్మికులు ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్నారు. కార్మికులకు పీఆర్సీ అందకపోతుండటంపై విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసేందుకు పలు కార్మిక సంఘాలు సిద్ధమయ్యారు. ఆరునెలలుగా అడుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించి కార్మికులకు అందరికీ పీఆర్సీ అమలయ్యేలా చూడాలని లేకపోతే ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం జీవో విడుదల చేసినాక కూడా పీఆర్సీ అందడం లేదంటే ఇంతకు మించిన నిర్లక్ష్యం ఏముంటది. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తానన్న సీఎం కేసీఆర్ మాటలు ఏమైనయి. రోడ్లు ఊడ్చే కార్మికులకు పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతుంది. ఆరు నెలలుగా అడుగుతున్నా స్పందించడం లేదు. త్వరలోనే చార్మినార్ నుంచి 10 వేల మంది కార్మికులతో నిరసన ర్యాలీ నిర్వహిస్తాం.