హైదరాబాద్ ఫిబ్రవరి 22,
దేశంలో రాజకీయాల గతిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీ నిరంకుశ విధానాలు, ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై వివిధ రాష్ట్రాల సీఎంల మద్దతు కూడగడుతున్నారు కేసీఆర్. తన పోరును జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరు మాట్లాడుకున్నారు. భేటీ అనంతరం వీరిద్దరూ మీడియా సమావేశం నిర్వహించారు. ఓ మంచి కార్యక్రమానికి తొలి అడుగు పడిందన్నారు సీఎం కేసీఆర్. త్వరలోనే నేతలమంతా హైదరాబాద్‌లో కలుస్తామని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన చర్చల్లో అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని కేసీఆర్ అన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు సానుకూలంగా సాగాయని చెప్పారు. ఇకపై అన్ని విషయాల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు కేసీఆర్. ప్రస్తుతం దేశరాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న సీఎం.. దేశంలో అతిపెద్ద పరివర్తన రావాలన్నారు. దేశ యువతను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శివాజీ మహరాజ్, బాల్‌ఠాక్రే ఇచ్చిన స్ఫూర్తితోనే పోరాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు.ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ ,కేరళ సీఎం పినరయి విజయన్ లను కలసిన కేసీఆర్. బీజేపీ వ్యతిరేక పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని ప్రకటించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ ఆయన చర్చలు జరపనున్నారు.