ఖమ్మం, ఫిబ్రవరి 22,
నియోజకవర్గానికి ఎమ్మెల్యే సుప్రీం. ఇది అధికారపార్టీ టీఆర్ఎస్ మాట. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకొన్న ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆ రూల్ పరిధిలో లేరో ఏమో.. స్థానికంగా ఆయన మాట చెల్లుబాటు కావడం లేదట. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై జరుగుతున్న వాడీవేడీ చర్చ ఇదే. ఇందుకు వైరా మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలే కారణం. వైరా మున్సిపల్ కమిషనర్ కేంద్రంగా రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి.వైరా మున్సిపల్ కమిషనర్‌గా వెంకటస్వామి పనిచేస్తున్నారు. ఆయన గతేడాది మణుగూరు నుంచి వచ్చారు. వెంకటస్వామి గురించి మున్సిపల్ సిబ్బంది.. అధికారపార్టీ నేతలు రకరకాలుగా చెప్పుకొంటారు. కమిషనర్‌గా పనులు చక్కబెట్టడంలో ఆయన సిద్ధహస్తుడేనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు లోకల్ లీడర్స్. అయ్యవారు మణుగూర్‌లో కమిషనర్‌గా ఉన్నప్పుడు అక్కడ మున్సిపల్ కౌన్సిల్ లేదు. ఆయనే సోల్ ఆఫీసర్. ఆయన చెప్పిందే అక్కడ శాసనంగా ఉండేదట. వైరాలో మాత్రం మున్సిపల్ కౌన్సిల్ ఉంది. మణుగురులో మాదిరి ఇక్కడా చేయాలని అనుకున్నారో ఏమో కౌన్సిలర్లను లెక్క చేయడం లేదన్నది కమిషనర్ వెంకటస్వామిపై ఉన్న ఆరోపణ. మున్సిపల్ ఛైర్మన్ జైపాల్, వైస్ ఛైర్మన్ సీతారాములను గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతారు.మున్సిపాలిటీలో మాట చెల్లుబాటు కాకపోవడంతో టీఆర్ఎస్ కౌన్సిలర్లు.. కమిషనర్‌ను బదిలీ చేయాలని పదిరోజుల క్రితం తీర్మానం చేశారు. కౌన్సిల్ సమావేశం పెట్టకుండానే మీటింగ్ జరిగినట్టుగా తమ దగ్గర కమిషనర్ సంతకాలు తీసుకున్నారన్నది కౌన్సిలర్ల ఆరోపణ. ఇప్పుడు మిగతా పార్టీల కౌన్సిలర్లు కూడా ఈ విషయంలో టీఆర్ఎస్ సభ్యులతో కలిసిపోయారట. దీంతో సమస్య ఎమ్మెల్యే రాములు నాయక్ దగ్గరకు వెళ్లడం.. ఆయన కమిషనర్ వెంకటస్వామిని బదిలీ చేయించడం చకచకా జరిగిపోయింది. అయితే బదిలీపై వెళ్లిన వెంకటస్వామి గోడకు కొట్టిన బంతిలా మళ్లీ వైరా మున్సిపల్ కమిషనర్‌గా వచ్చేశారు. వెంకటస్వామి రీ ఎంట్రీతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట కౌన్సిలర్లు.కౌన్సిలర్లు అంతా కలిసి మరోసారి ఎమ్మెల్యే రాములు నాయక్ దగ్గరకు వెళ్లారట. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంకటస్వామిని బదిలీ చేసినా సీన్ రివర్స్ కావడంతో ఎమ్మెల్యేకూ ఏం అర్థం కావడం లేదట. తానేం చేయలేనని రాములు నాయక్ చేతులు ఎత్తేసినట్టు ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు కమిషనర్ గుప్పిట్లో ఉన్న ఛైర్మన్ జైపాల్, వైస్ ఛైర్మన్ సీతారాములు సైతం ఆ మాయ నుంచి బయటకొచ్చి అసంతృప్తులతో కలిశారట. అంతా కలిసి ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తున్నా ఎమ్మెల్యే రాములు నాయక్ తన మాట చెల్లడం లేదని వాపోతున్నారట. తన దగ్గరకు వచ్చేవాళ్లకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదట. దీంతో ఎమ్మెల్యే పవర్ ఏమైంది? ఒక అధికారిని కూడా బదిలీ చేయించుకోలేకపోతున్నారా అని అధికారపార్టీ వర్గాలు ఒక్కటే చెవులు కొరుక్కుంటున్నాయట. ఆ విషయం తెలిసి రాములు నాయక్ తల పట్టుకున్నట్టు సమచారం.