నెల్లూరు
గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం సొంత జిల్లా నెల్లూరు చేరుకుంది. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్లో గౌతమ్ రెడ్డి డెడ్‌బాడీని నెల్లూరుకు తీసుకువచ్చారు. నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు తరలించారు. పరేడ్ గ్రౌండ్ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయాన్ని మంత్రి అనిల్ కుమర్ తదితరులు దగ్గరుండి తరలించనున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి ఇంటి దగ్గర విషాదఛాయలు అలుకుకున్నాయి. గౌతమ్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అభిమాన నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివస్తున్నారు మేకపాటి అభిమానులు. రేపు ఉదయగిరిలో అధికార లాంఛనాలతో నిర్వహించే అంత్యక్రియలకు సీఎం జగన్, మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా.. ఉదయగిరి మెరిట్ ఇంజనీరింగ్ కాలేజీలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.