హైదరాబాద్, ఫిబ్రవరి 23,
రాజకీయ విబేధాలు సహజం. కానీ, రాజకీయ విబేధాల కారణంగా గవర్నర్ వ్యవస్థ వంటి రాజ్యాంగ వ్యవస్థలను అగౌరపరచడం అప్రజాస్వామికం, ఇది ఒకసారి కాదు, వందల సార్లు రాజ్యంగ నిపుణులు వ్యక్త పరిచిన అభిప్రాయం. ఈఎస్ఎల్ నరసింహన్, ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్’గా ఉన్నరోజుల్లో అయితే నేమి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్’గా ఉన్న రోజుల్లో అయితే నేమి తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ తరచూ రాజ్’భవన్ వెళ్లి గవర్నర్’ను కలిసి పరిపాలనకు సంబదించిన విషయాలు చర్చించడం ఆనవాయితీగా ఉండేది. అంతే కాదు, అపప్ట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్’ పట్ల గౌరవాన్ని మించిన భక్తిని ప్రదర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పాదాభి వందనం, సాష్టాంగ నమస్కారాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు, అప్పట్లో, ముఖ్యమంత్రి ఆవిధంగా గవర్నర్’కు వంగి వంగి దండాలు పెట్టడం, సాష్టాంగ నమస్కారాలు చేయడం కొందరికి నచ్చలేదు. విపక్షాలు విమర్శలు కూడా చేశాయి. అయినా, నరసింహన్ గవర్నర్’గా ఉన్నంత కాలం ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రోటోకాల్ గీతదాటి కూడా గవర్నర్’ను గౌరవించారు. ఇటీవల ముఖ్యమంత్రి చెన్నై వెళ్ళిన సమయంలోనూ, రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్’ ను కలిసే ప్రయత్నం చేశారు. అయితే ఎందుకనో నరసింహన్’ను కలవలేక పోయారు. నరసింహన్’ విషయంలో అంతలా గౌరవం చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్’ విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదనన్ విమర్శలు వినవస్తున్నాయి. నిజానికి. గవర్నర్ తమిళిసై’ తో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి అంటీముట్టనట్లే ఉంటున్నారు. రాజ్ భవన్ మెట్లు ఎక్కడమే కాదు, అటుగా కన్నెత్తి చూసిన సందర్భాలను వేళ్ళ మీద లెక్కించవచ్చునేమో. అదలా ఉంటే, హుజూరాబాద్’ పరాభవం నేపధ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై యుద్దాన్ని ప్రకటించిన తర్వాత ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరిగింది. దూరం పెరగడమే కాదు, చిత్రంగా ముఖ్యమంత్రి, మంత్రులు గవర్నర్’ను రాజకీయ ప్రత్యర్ధిగా చుస్తున్నారా, అనే సందేహం వచ్చేలా ప్రవర్తిస్తున్నారనే భావన బలపడుతోంది. కొవిడ్ కారణంగా, రాజ్ భవన్’లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ పాల్గొన లేదు. చీఫ్ సెక్రటరీ, డీజీపీలు మాత్రం మొగ్గుబడిగా పాల్గొన్నారు. అదలా ఉంటే తాజాగా గవర్నర్ తమిళిసై మేడారం పర్యటన సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు మరింత వివాదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గవర్నర్’ను వరస అవమనాలకు గురి చేస్తోందనే ఆరోపణలకు బలం చేకురుస్తోంది. నిజానికి, సందర్భం ఏదైనా గవర్నర్ జిల్లా పర్యటనకు వచ్చి నప్పుడు ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై, ఆహ్వానించాల్సి ఉంది. కానీ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన గవర్నర్ ‘ను అధికారులు ఎవరూ ఆహ్వానించలేదు. జాయింట్ కలెక్టర్ ఇలాత్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క (కాంగ్రెస్) మాత్రమే గవర్నర్’కు స్వాగతం పలికారు. గవర్నర్ మేడారం పర్యటనకు హెలికాప్టర్ సమకూర్చాలని గవర్నర్ కార్యాలయం కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి గవర్నర్ రోడ్డుమార్గంలో మేడారానికి వెళ్లారు. గవర్నర్ మేడారం చేరడానికి ముందే మంత్రులు అధికారులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. తర్వాత గవర్నర్ వస్తున్నారని తెలిసినా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇదే విషయంగా ఎమ్మెల్యే సీతక్క కూడా ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. స్థానిక ఎమ్మెల్యేగా, తనకు కూడా ప్రభుత్వం ఇవ్వవలసిన ప్రధాన్యత ఇవ్వలేదని, ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన వ్యక్త పరిచారు. అయితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపట్ల చూసీ చూడనట్లు ఊరుకున్న కేంద్ర హోమ్ శాఖ మేడారం జాతర సందర్భంగా ప్రోటోకాల్ పాటించక పోవడంతో పాటుగా, నక్సల్ ప్రభావిత ప్రాంతంలో గవర్నర్’కు రక్షణ కలిపించక పోవడం పట్ల సీరియస్ అయినట్లు సమాచారం. ఇదలా ఉంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులతో కలిసి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ గవర్నర్ వ్యవస్థ పై మరో యుద్ధానికి సిద్దమవుతున్నారు. రాష్ట్ర గవర్నర్’ ను అవమానించడానికి ఇది కూడా కారణం కావచ్చును అంటున్నారు.