హైదరాబాద్, ఫిబ్రవరి 23,
కేసీఆర్ చాణక్యం అంత ఈజీగా అంతుచిక్కదు. ఫలితం ఎలా ఉన్నా.. వ్యూహం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా, ఢిల్లీలో చక్రం తిప్పేందుకు ముంబై వెళ్లిన కేసీఆర్.. తన రాజకీయ పరివారంతో పాటు కూతురు కవితను తీసుకెళ్లారు. కొడుకు కేటీఆర్‌ను మాత్రం వద్దన్నారు. ఇదే ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ స్ట్రాటజీ ఏమై ఉంటుందా? అనే చర్చ మొదలైంది. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు, వివాదాలు అంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్న కేటీఆర్‌తో, చెల్లి కవితకు విభేదాలు వచ్చాయని.. అదికాస్తా కేసీఆర్‌తో వివాదంగా మారిందని అన్నారు. అందుకు తగ్గట్టే.. చాలాకాలంగా కవిత తండ్రిని కలిసింది లేదు. ప్రగతి భవన్‌లో అడుగుపెట్టింది లేదు. అన్నకు రాఖీ కట్టింది లేదు. టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా వచ్చింది లేదు. అంతలా తండ్రి, అన్నతో దూరం జరిగారు కవిత. మంత్రి పదవి కోసమో.. ఆస్తిలో వాటాల కోసమే కారణం ఏంటో తెలీదు కానీ.. కల్వకుంట్ల కుటుంబంలో కుంపటి మాత్రం రగిలింది. అయితే, కవితకు ఎమ్మెల్సీ కట్టబెట్టాక కాస్త కూల్ అయినట్టున్నారు. ఇటీవల పొలిటికల్ కామెంట్స్ చేస్తూ ఇంకాస్త యాక్టివ్ అయ్యారు. లేటెస్ట్‌గా.. కేసీఆర్‌తో పాటు ముంబై వెళ్లి.. మేమంతా ఒకటే అనే మెసేజ్ ఇచ్చేశారు. కారణం ఏమై ఉంటుంది? కేసీఆర్ వెంట కేటీఆర్ వెళ్లకుండా.. కవితనే ఎందుకు తీసుకెళ్లినట్టు.. అనే చర్చ నడుస్తోంది. కవిత గతంలో ఎంపీగా చేశారు. పార్లమెంట్‌లో మంచి ప్రసంగాలతో జాతీయ స్థాయిలో కాస్త గుర్తింపు పొందారు. అప్పట్లో మహారాష్ట్ర ఎన్సీపీ నుంచి శరద్ పవార్ కూతురు సుప్రియ సులే, తమిళనాడు డీఎంకే తరఫున కనిమొళి, తెలంగాణ టీఆర్ఎస్ నుంచి కవిత పార్లమెంట్‌లో బలమైన వాయిస్ వినిపించేవారు. అలా, కవితను కాస్తోకూస్తో గుర్తుపడతారు పలువురు జాతీయ నేతలు. అలా, మహారాష్ట్ర వెళ్లిన కేసీఆర్ తనతో పాటు కూతురు కవితను తీసుకెళ్లారు. అయితే, ఆ టూర్ సందర్భంగా తండ్రికూతుళ్లు మాట్లాడుకున్నట్టు ఒక్క వీడియో కానీ, ఫోటో కానీ లేకపోవడం మరింత ఆసక్తికరం. అంటే, వివాదం ఇంకా కొనసాగుతోందనేగా అర్థం? అంటున్నారు. కవిత సరే.. మరి కేటీఆర్‌ను ఎందుకు తీసుకెళ్లలేదనే పాయింట్ వస్తోంది. జాతీయ స్థాయిలో కేటీఆర్ ఎవరో ఎవరికీ తెలీదు. కవితనైనా గుర్తుపడతారు కానీ, కేటీఆర్‌ను ఎవరూ రికగ్నైజ్ చేయరు. అందుకే, కేటీఆర్‌ను తీసుకెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండదనుకున్నారో ఏమో.. బయటి వారిని అసలేమాత్రం నమ్మని కేసీఆర్.. ఇష్టం లేకపోయినా కూతురు కవితను వెంటేసుకొని వెళ్లారని అంటున్నారు. ఇక, ఇటీవల వరుస ప్రెస్‌మీట్లతో కేంద్రంపై, మోదీపై విరుచుకుపడుతున్నారు కేసీఆర్. ఆయా మీడియా సమావేశాల్లో అల్లుడు హరీష్‌రావు ఆయన పక్కనే ఉంటున్నారు కానీ, కేటీఆర్ ఆ ప్రెస్‌మీట్లలో కనిపించడం లేదు. ఎందుకు? మోదీపై విమర్శల సమయంలో కేటీఆర్‌ను ఎందుకు పక్కన పెట్టుకోకుండా.. పక్కన పెట్టేస్తున్నారనే చర్చా నడుస్తోంది. కేటీఆర్‌ను జాతీయ రాజకీయాలకు దూరంగా పెట్టి.. ఫుల్‌గా స్టేట్ పాలిటిక్స్‌ఫైనే ఫోకస్ పెట్టించాలనేది కేసీఆర్ స్ట్రాటజీనా? అంటున్నారు. ఇక, ఢిల్లీ బాట పట్టేందుకు తెగ హుషారుగా ఉన్న కేసీఆర్.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టి రాష్ట్రానికే పరిమితం చేయనున్నారు. కుదిరితే హరీష్‌రావు, లేదంటే కవితలను వెంటేసుకొని.. ఢిల్లీపై దండయాత్రకు కేసీఆర్ తరలిపోనున్నారని అందుకే, నేషనల్ పాలిటిక్స్ నుంచి కేటీఆర్‌ను మాగ్జిమమ్ దూరం పెడుతున్నారని.. అల్లుడినో, కూతురినో తన అడుగు జాడల్లో నడిచేలా చేయాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.