హైదరాబాద్ ఫిబ్రవరి 23
తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టుకు కేంద్రం ఎంత మేర సహకారం అందించిందో తెలుసా అంటూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన, దేశానికే తలమానికంగా ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఎంత వరకు సహకరించిందో తెలుసా? అంచనా వేయగలరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ తెలంగాణ వ్యవసాయ సాగులో నూతన చరిత్రను సృష్టించనున్నదని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకొన్నారు. నీటితో కళకళలాడుతున్న మల్లన్నసాగర్ ఫొటోపై ‘ది మదర్ ఆఫ్ ఆల్ రిజర్వాయర్స్ ఇన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు’ అని రాసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. 11.29 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్న అతిపెద్ద రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారని, అది మరచిపోలేని మధురజ్ఞాపకమని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుదిదశకు చేరుకొంటున్నది. ముఖ్యంగా మల్లన్నసాగర్ తెలంగాణకు గుండెకాయ. మొత్తం ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం ఇదే. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్‌లు (తూములు) ఉన్నాయి. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు, మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు.