కాకినాడ ఫిబ్రవరి 23
తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కోరింగ మడ అడవుల వద్ద మూడు అరుదైన జాతుల వలస పక్షులను గుర్తించారు. జిల్లాలోని కోరింగ మడ అడవులు, పరిసరాల్లోని 12 ప్రదేశాల్లో ఆసియా వాటర్ బర్డ్ సెన్సస్‌లో భాగంగా పరిశోధకులు సర్వే చేపట్టారు. పక్షులను లెక్కించడం కోసం 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ, వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పరిశోధకులు తెలిపారు. సైబీరియా, రష్యా, మంగోలియా నుంచి బ్రాడ్ బిల్‌డ్ శాండ్‌పైపర్ పక్షుల వలసలను గుర్తించారు. అలాగే, ఒమన్, అరబ్ దేశాల నుంచి క్రాబ్ ప్లవర్, గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు కూడా వలస వచ్చినట్లు ఈ బృందాలు తెలిపాయి. 2017లో మొత్తం 43,718 పక్షులు కనిపించాయని, ఐదేండ్ల తర్వాత 46,546 వలస పక్షులు జిల్లాకు వచ్చాయని వణ్యప్రాణి జీవశాస్త్రవేత్త డీ మహేశ్ తెలిపారు. నెల రోజుల వ్యవధిలో పక్షుల లెక్కింపు పూర్తిచేశామన్నారు. జనవరిలో కాకినాడ సమీపంలోని రాజమహేంద్రవరం, కోరింగ, కోటిపల్లి గోదావరి, కాట్రేనికోన, ఎస్ యానాం, కుంబాభిషేకం, పాండి, పోర, పల్లం, శాక్రమెంట్ ఐలాండ్, హోప్ ఐలాండ్‌లలో సర్వే నిర్వహించినట్లు మహేష్ తెలిపారు. పరిశోధనా బృందం రాజమహేంద్రవరంలోని వన్యప్రాణి విభాగానికి నివేదిక సమర్పించింది.
2021లో 104 జాతుల నుంచి 34,207 వలస పక్షులు కనిపించగా.. ప్రస్తుతం 108 జాతులకు చెందిన 46,546 పక్షులు కనిపించినట్లు వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సీ సెల్వం వెల్లడించారు. జిల్లాలోని కోరింగా, ఇతర ప్రాంతాల్లో 2020లో 96 జాతులకు చెందిన 26,734 పక్షులు కనిపించాయని చెప్పారు.