న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23,
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.. ఆమె పాటలు, ఆమె జీవితం, తండ్రితో గొడవలు, కోర్టు కేసులు ఇలా ఆమె జీవితమే ఒక నరకప్రాయమని చెప్పాలి. అయితే అందరికి తెలిసినవి కొన్నే ఉన్నా.. ఎవ్వరికీ తెలియనివి.. ఆమె మనసులో గూడు కట్టుకున్న రహస్యాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని బయటపెట్టాలని, బ్రిట్నీ జీవితం అందరికి తెలియాలని అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్ భీష్మించుకు కూర్చొంది. ఇందుకోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్దమంటుంది.పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితాన్ని ఒక పుస్తక రూపంలో పబ్లిష్ చేయడానికి ఆ సంస్థ బ్రిట్నీ కి 15 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 112 కోట్ల రూపాయలు అప్పజెప్పేందుకు సిద్దమయ్యింది. ఆమె జీవితంలో ఉన్న రహస్యాలన్నీ చెప్పడానికి బ్రిట్నీ కూడా అంగీకరించింది. చిన్నతనంలో ఈ సింగర్ పడిన నరకం, బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్ సంరక్షణలో తాను అనుభవించిన 13 ఏళ్ల నరకప్రాయమైన జీవితం గురించి అనేక రహస్యాలను ఆమె ఈ బుక్ లో వెల్లడించనున్నదట. అందుకోసమే అన్ని కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక తండ్రి చెర నుంచి బయటపడడానికి బ్రిట్నీ చేసిన పోరాటం తెలియంది కాదు. కోర్టుల చుట్టూ ఎన్నో ఏళ్లు తిరిగి ఎట్టకేలకు ఇటీవలే కోర్టు ద్వారా తండ్రి చెరనుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె స్వతంత్రంగా జీవిస్తుంది.