కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ దక్కదని, హంగ్ ఏర్పడుతుందని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెబుతుండడంతో కర్ణాటకలోని మరో పార్టీ జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారుతుందని అందరూ భావిస్తున్నారు. ఆ పార్టీ ఎవరికి మద్దతిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.ఇటువంటి సమయంలో జేడీఎస్ నేత కుమారస్వామి సింగపూర్‌లో ఉన్నారు. మొన్న పోలింగ్ ముగియగానే ఆయన అక్కడకు వెళ్లిపోవడంతో.. ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై చర్చలు జరిపేందుకే ఆయన వెళ్లినట్లు కొందరు భావిస్తున్నారు. కుమారస్వామి సన్నిహితుడు ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు తమ పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారని, ఈ చర్చల్లో పాల్గొనేందుకే కుమారస్వామి సింగపూర్ వెళ్లి ఉండొచ్చని అనడం గమనార్హం. ఒకవేళ చర్చలు ఇక్కడే జరిగితే ఆ విషయాలన్నీ మీడియాకు తెలిసే అవకాశముంటుందని చెప్పారు.