YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అవినాష్ కు బిగిస్తున్న ఉచ్చు

అవినాష్ కు బిగిస్తున్న ఉచ్చు

కడప,ఫిబ్రవరి 24,
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఉచ్చు మరింతగా బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ అవినాశ్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి కుట్ర ఉందని సీబీఐ ఇప్పటికే చార్జిషీట్ వేసింది. ఎంపీ టికెట్ తనకు ఇవ్వొద్దని అన్నందుకే వివేకా హత్యకు కుట్ర చేసి ఉంటారని కూడా సీబీఐ చెబుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని అవినాశ్ రెడ్డి మనుషులు వెంటాడి, వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దస్తగిరికి డబ్బు, పొలం ఆశ చూపించి.. సీబీఐ విచారణ వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సీబీఐకి ఫిర్యాదు రావడం గమనార్హం. ‘సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఏం చెప్పావ్.. అవినాశ్ రెడ్డి పిలుస్తున్నాడు రా!’ అంటూ అప్రూవర్ దస్తగిరిని బెదిరించారట. ‘వివేకానందరెడ్డి ఇంటి లోపల ఏం జరిగిందో చెబితే నరికేస్తా’ అని ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించినట్లు ఇంటి వాచ్ మన్ రంగన్న కూడా చెప్పాడు.తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో తాజాగా ఆనాటి పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకి చెప్పిన వివరాలు కూడా అవినాశ్ రెడ్డినే నిందితుడిగా చూపిస్తున్నాయి. వివేకానందరెడ్డి మరణించిన వెంటనే ఆయన గుండెపోటుతో చనిపోయారనే కథ అవినాశ్ రెడ్డే అల్లినట్లు సీబీఐకి సీఐ శంకరయ్య చెప్పిన మాటల్లో స్పష్టం అవుతోంది. ‘వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ఎంపీ అవినాశ్ రెడ్డి నాకు ఫోన్ లో చెప్పారు’ అని సీబీఐకి సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. వివేకాకు రక్తపు వాంతుల కథ, బెడ్రూంలో దుప్పటి మార్చడం, మృతదేహానికి కుట్లు వేయడం, కట్లు కట్టడం.. ఇలా అన్నీ అనుమానాస్పదంగానే జరిగాయని కూడా శంకరయ్య సీబీఐకి తెలిపారు. వివేకా మర్డర్ జరిగిన తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలోనే హత్యకు సంబంధించిన ఆధారాలు చెరిపేశారని కూడా సీఐ శంకరయ్య వివరించారు.‘వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి నాకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత నాతో అవినాశ్ రెడ్డి మాట్లాడారు. ఒక బ్యాడ్ న్యూస్ అంటూ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు చెప్పారు. వెంటనే మా పోలీసు సిబ్బందిని వివేకా ఇంటి వద్దకు తీసుకురావాలన్నారు. ఇదే విషయం నేను స్థానిక డీఎస్పీకి తెలియజేశాను. ఎస్ఐలు, కానిస్టేబళ్లకు ఫోన్లు చేస్తుండగా.. ఐదు నిమిషాల్లో దేవిరెడ్డి శంకర్ రెడ్డి మరోసారి నాకు ఫోన్ చేశారు. ఆలస్యం ఎందుకు అవుతోందని కోప్పడ్డారు. సిబ్బందితో నేను సంఘటనా స్థలానికి వెళ్లే సరికే.. లోపల వైఎస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దొండ్లవాగు శంకర్ రెడ్డి, కాంపౌండర్లు వెంకటేశ్ నాయక్, జయప్రకాశ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అక్కడ ఫొటోలు తీసి ఏడు గంటల సమయంలో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మకు వాట్సాప్ చేశాను. బాత్ రూమ్ లోపల టైల్స్ పై రక్తం, బెడ్రూంలో దుప్పటిపై రక్తపు మరకలు, వివేకానందరెడ్డి తలపై బలమైన గాయాలు కనిపించాయి. దాంతో వివేకాది గుండెపోటు కాదని నేను వాదించాను. దాంతో ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి నోర్మూసుకో.. అని నన్ను బెదిరించారు. సైలెంట్ గా ఉండకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు’ అని సీఐ శంకరయ్య సీబీఐకి మొత్తం వివరాలు తెలిపారు. 2020 జులై 28న సీబీఐ అధికారుల ఎదుట సీఐ శంకరయ్య వాంగ్మూలం ఇచ్చారు. ఆయన వాంగ్మూలం, అందులోని ముఖ్యమైన అంశాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి.వివేకా మృతి ఘటనపై కేసు నమోదు చేయొద్దని అవినాశ్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తనపై వత్తిడి తెచ్చారని అన్నారు. ఈ విషయం అప్పటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ దృష్టికి తాను తీసుకెళ్లానన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివేకా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించొద్దన్నారని చెప్పారు. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి డైరెక్షన్, పర్యవేక్షణలోనే ఘటనా స్థలంలో ఆధారాల ధ్వంసం ప్రక్రియ జరిగిందన్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేసే సమయంలోనే వివేకా ఇంటిలోపలికి ఎవరూ రాకుండా వైఎస్ భాస్కర్ రెడ్డి లోపలి నుంచి తలుపులు మూసేశారని సీఐ శంకరయ్య సీబీఐకి తెలిపారు. భాస్కర్ రెడ్డి తలుపు వద్దే ఉండి రక్తపు మరకలు శుభ్రం చేసే, గాయాలకు కట్లు, బ్ఆయండేజ్ వేసే వారిని మాత్రమే అనుమతించారని చెప్పారు. ఆ సమయంలో అవినాశ్ రెడ్డి రెండు మూడు సార్లు లోపలికి వెళ్లి కాసేపటి తర్వాత బయటకు వచ్చారని కూడా సీఐ వివరించారు.వివేకా మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టి, ఆయన శరీరంపై గాయాలు కనిపించకుండా చేయాలని చూశారని సీఐ శంకరయ్య వెల్లడించారు. వివేకా మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టి, గాయాలను పూలతో కప్పేయాలని చూశారన్నారు. కొందరు వ్యక్తులు ఫ్రీజర్ తీసుకువస్తే.. దాన్ని తాను వెనక్కి పంపించానన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించాలని, ఫ్రీజర్ లో పెట్టొద్దని ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి చెప్పానన్నారు. వారు ఈ విషయం అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డికి చెప్పారన్నారు. ఆ తర్వాత శివశంకర్ రెడ్డి అంబులెన్స్ పిలిపించినట్లు సీఐ శంకరయ్య వెల్లడించారు. వివేకా మృతదేహాన్ని చూసేందుకు నాలుగైదు వందల మంది వచ్చేందుకు ప్రయత్నిస్తే వారిని నియంత్రించామన్నారు. లాయర్ ఓబుల్ రెడ్డి ఘటనా స్థలంలోని రక్తపు మరకలు చూశారని, బయటకు వచ్చి ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డితో చెప్పారని, ఆ తర్వాతే ఆధారాల ధ్వంసం ప్రక్రియ మొదలైందన్నారు. తనతో పాటు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లను లోనికి వెళ్లకుండా శివశంకర్ రెడ్డి అడ్డుకుని, తనను ఒక్కడిని మాత్రమే లోపలికి పంపాడన్నారు. వివేకా సహాయకుడు ఇనయతుల్లా కూడా అనుమానం వ్యక్తం చేస్తే.. ‘మీ సార్ కి ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఆయనను హత్య చేసే అవకాశమే లేదు’ అని శివశంకర్ రెడ్డి బెదిరించినట్లు సీఐ శంకరయ్య తెలిపారు.వివేకానందరెడ్డి మృతదేహాన్ని బాత్ రూం నుంచి బెడ్ రూంకు ఎర్ర గంగిరెడ్డి తీసుకొచ్చారు. రక్తపు మరకలతో ఉన్న వివేకా దుస్తులను మార్చేందుకు ప్రయత్నించారు. అయితే.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించాలని, దుస్తులు మార్చటానికి వీల్లేదని వారిని నిలువరించాను. ఘటనా స్థలం మొత్తం వీడియో తీయాలని మా సిబ్బందికి చెప్పాను. వారు వీడియో తీస్తుండగా ఆపేయాలని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గట్టిగా కేకలు వేశారు. ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి, ఎం.వీ. కృష్ణారెడ్ది, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి పాత్ర అనుమానాస్పదం అనిపించింది. నేర స్థలంలో వైఎస్ అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి పాత్ర అనుమానాస్పదం అనిపించింది‘ అని సీఐ శంకరయ్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారు. వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందనే అనుమానం ఉన్నట్లు తన దర్యాప్తులో వెల్లడైందని గతంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన రెడ్డివారి వాసుదేవన్ సీబీఐకి తెలిపారు.ఇలా ఉండగా.. వివేకా హత్య కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ పై రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. ఈ కేసు విచారణలో సీబీఐ అధికారి తనను వేధిస్తున్నారంటూ పులివెందుల బాకరాపురానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి 15న ఏఆర్ అదనపు ఎస్పీ మహేశ్ కుమార్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన తాను చెప్పిన విషయాలు పట్టించుకోకుండా.. తాము చెప్పినట్లు వినాలని సీబీఐ అధికారి రామ్ సింగ్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఉదయ్ కుమార్ రెడ్డి ఆరోపించడం గమనార్హం.

Related Posts