హైదరాబాద్, ఫిబ్రవరి 24,
దేశమంతా పీకే శిష్యులే. ప్రశాంత్ కిశోర్ బ్రాండ్‌కు ఇప్పుడు బిగ్ డిమాండ్. జగన్, స్టాలిన్, మమత గెలుపుతో పీకేకు తిరుగులేకుండా పోయింది. అందుకే, తానే తోపుననుకునే కేసీఆర్ సైతం ఐ-ప్యాక్‌ను ఆశ్రయించక తప్పలేదు. షర్మిల సైతం పీకేనే హైర్ చేసుకుంది. అయితే, ప్రశాంత్ కిశోర్‌కు ఎంత డిమాండ్ ఉందో.. ఆయన టీమ్ సభ్యులకూ అంతే డిమాండ్. చాలామంది ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూషన్స్‌లో.. ప్రెస్టీజియస్ కోర్సులు చేసిన వారే కావడంతో.. పీకే టీమ్ అంతా టాలెంటెడే. ఐ-ప్యాక్‌లో రాజకీయ విశ్లేషణల్లో రాటుదేలిన వారే. అందుకే, వారిలో చాలామంది సొంతంగా స్ట్రాటజిస్ట్స్ అవతారం ఎత్తారు. పలు రాజకీయ పార్టీలతో కలిసి పని చేస్తున్నారు. ఇక, ఇన్నాళ్లూ టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన రాబిన్ శర్మ సైతం గతంలో పీకే టీమ్‌కు చెందినవారే. తాజాగా ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాబిన్ శర్మ స్థానంలో ప్రశాంత్ కిశోర్ టీమ్ మాజీ సభ్యుడు సునీల్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. సునీల్ తో టీడీపీ కేవలం 3 నెలలకు మాత్రమే ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. కొత్త టీమ్ పనితీరు నచ్చితే అగ్రిమెంట్ పొడిగించాలని అనుకుంటున్నారట. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు పని చేసిన టీమ్‌లో సునీల్ కీలక సభ్యుడిగా ఉన్నారు.మరి, దూకుడు మీదున్న జగన్‌రెడ్డిని ధీటుగా ఢీ కొట్టేలా.. సునీల్ తన వ్యూహాలతో టీడీపీని ఏ మేరకు సానబడతారో చూడాలి..