గుంటూరు, ఫిబ్రవరి 24,
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ జాక్ పాట్ కొట్టబోతున్నారా? అదృష్ట యోగం పట్టి.. ఆమెను అమాత్య పదవి వరించనుందా? సీఎం జగన్ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఆ క్రమంలో ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జలతో సీఎం జగన్ డిస్కషన్ చేశారా? అంటే అవుననే అంటున్నాయి తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు.మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పదవి ఖాళీ అయింది. అయితే ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం మూడూ.... మూడు శాఖలే. ఈ శాఖను పక్కన పెడితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర గందరగోళమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆ మంత్రి పదవి ఎవరిని వరిస్తోందంటూ అప్పుడే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ శాఖను సీఎం జగన్.. విడదల రజినీకి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విడదల రజని.. ఎన్నారై రిటర్న్. ఆమె సాఫ్ట్‌వేర్ రంగం నుంచి నేరుగా రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెకు ఇన్పర్మేషన్ టెక్నాలజీపై మంచి పరిజ్జానమే ఉంది. దీంతో ఆమెకు ఈ పదవి కట్టబెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మంత్రి పదవికి పలువురు పేర్లు సైతం తెరపైకి వచ్చినట్లు సమాచారం. అందులో ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచో ఆర్కే రోజా మంత్రి పదవి కోసం కాచుకు కూర్చుని ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపుతో.. జగన్ కేబినెట్‌లో తనకు సీటు గ్యారెంటీ అని రోజా భావించారు. కానీ ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో... నాడు సీఎం జగన్ ఎదుటే ఆమె నిరసనకు దిగింది. దాంతో ఆమెకు సీఎం జగన్ ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక, రోజాకు ఎప్పటికీ మంత్రి పదవి రాకుండా.. ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి ఎలాగూ అడ్డుకోవడం ఖాయం అంటున్నారు. ఇటీవల రోజా, పెద్దిరెడ్డిల మధ్య వైరం బాగా ముదిరిపోయింది. ఈ విషయం రెడ్డివారి చక్రపాణిరెడ్డి వ్యవహారంలో బట్ట బయలు అయింది. ఈ నేపథ్యంలో రోజాకు చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి ఎంత చేయాలో అన్ని చేస్తారని.. ఈ నేపథ్యంలో రోజా మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే..అంటున్నారు. ఇక, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఈ శాఖలు అప్పగిస్తే.. మరింత టెన్షన్ పడే అవకాశం ఉందని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో అప్పుల కోసం ఆయన ఢిల్లీ, అమరావతి వయా ముంబై మీదగా చక్కెర్లు మీద చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఆయన పేరును ముఖ్యమంత్రి పక్కన పెట్టినట్లు సమాచారం. ఇస్తే గిస్తే.. పరిశ్రమలు, వాణిజ్య శాఖను బుగ్గనకు అప్పగించి.. ఐటీని మరొకరికి కట్టబెడతారని టాక్.సీఎం జగన్.. విడదల రజినీ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఫారెన్ రిటర్న్ అయిన విడదల రజనీ.. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో.. హైటెక్ సిటీలో చంద్రబాబు పెట్టిన ఓ మొక్క తానంటూ తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత.. ఆమె ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసి.. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాదు నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీలోని అన్ని గ్రూప్‌లను ఒంటి కాలితో తొక్కి పెట్టి.. ఎక్కడా తగ్గేదే లే అన్న స్టైల్‌లో దూసుకుపోతున్నారు. ఇక మంత్రిగా ఆమెకు ప్రమోషన్ ఇస్తే.. రజనీ రేంజ్ మరింత పెరగడం.. రెచ్చిపోవడం ఖాయం.. అంటున్నారు.