కోల్ కత్తా, ఫిబ్రవరి 24,
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలల్లో, తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల (221 / 295) మెజారిటీతో హ్యట్రిక్ సొంతం చేసుకుంది మమతా బెనర్జీ ముచ్టటగా మూడవసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ విజయం తృణమూల్ విజయమా? మమతా బెనర్జీ విజయమా? లేక ఆ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ (పీకే) విజయమా?అంటే,ప్రశాంత్ కిశోర్ విజయంగానే ప్రచారం జరిగింది. గెలిచింది తృణమూల్/మమత గెలిపించింది పీకే అనే ప్రచారమే ఎక్కువగా జరిగింది. అంతే కాకుండా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగనని, ప్రకటించిన ప్రశాంత్ కిశోర్, తృణమూల్’తో కలిసి ప్రయాణం సాగిస్తూనే వచ్చారు. మరోవంక జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ వ్యూహాన్ని ముందుకు తీసుకు పోయారు. మమతా బెనర్జీ తమ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి, పార్టీ విస్తరణ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. పీకే డైరెక్షన్’ లోనే మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సుష్మిత దేవి, గోవా మాజీ ముఖ్యమంత్రి లుయిజినో ఫిలీరో, మరి కొందరు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు కాంగ్రెస్’ను వదిలి తృణమూల్ లో చేరారు. అయితే ఇప్పడు తృణమూల్ కాంగ్రెస్ లో పీకే రగిల్చిన చిచ్చు భగ్గుమంటోందని వార్త లొస్తున్నాయి. అది కూడా పీకే కారణంగా.. పార్టీ రెండుగా చీలిపోయే స్థితికి చేరుకుందని అంటున్నారు. పాత కొత్త తరం నాయకుల మధ్య విబేధాలు రోజు రోజుకు మరింతగా ముదిరి పాకన పడుతున్నాయి. పార్టీ మమత వర్గం, అభిషేక్ వర్గంగా విడిపోయింది. పార్టీ పాత కాపులు, అభిషేక్ బెనీర్జీలో కొత్త ఆశలు చిగురించడానికి పీకేనే కారణమని మమతకు ఫిర్యాదు చేశారు. కొంచెం ఆలస్యంగానే అయినా మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీని జాతీయ ప్రదాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. ఈ అంతర్గత కుమ్ములాటల కారణంగా, తృణమూల్ లో చేరిన గోవా మాజీ ముఖ్యమంత్రి ఫిలెరియో సహా పార్టీ టికెట్ ఇచ్చినా కొందరు నాయకులు/ అభ్యర్ధులు కూడా, మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. అదెలా ఉన్నా, తృణమూల్ కాంగ్రెస్’తో ప్రశాంత్ కిశోర్ హనీమూన్ మాత్రం ముగిసి పోయినట్లే అంటున్నారు. ‘ఇప్పుడది ముగిసిన అధ్యాయం. పీకే పేరు వింటేనే దీదీ మండిపోతున్నారని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. పీకేని నమ్మి మమత దీదీ ఇచ్చిన స్వేచ్ఛను.. పీకే, అభిషేక్ ఇద్దరూ దుర్వినియోగం చేశారని, పార్టీ మింగేసే ప్రయత్నం చేశారని సీనియర్ నాయకులు భగ్గు మంటున్నారు. దీంతో తృణమూల్... పీకే ఐ ప్యాక్ సంబంధాలు బ్రేకప్’ స్థాయికి చేరుకున్నాయి. అయితే తృణమూల్, పీకే మధ్య విభేదాలు, విడాకుల వరకు రావడంలో ఆశ్చర్య పోనవసరం లేదని పీకే చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. పీకే, ఆయన నడిపే ఐ – ప్యాక్ కంపెనీ ఎవరితో కలిసి పనిచేస్తే వారితో తెగతెంపులు చేసుకోవడం, ఆ పార్టీలో చిచ్చు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ 2013లో ఎన్నికల వ్యూహకర్తగా తొలి అడుగు వేశారు. 2014లోక్ సభ ఎన్నికలకు బీజేపీ, నరేంద్ర మోడీతో కలిసి పనిచేశారు. ఆ ఎన్నికలలో బీజేపీ విజయం, సాధించింది. మోడీ ప్రధాని అయ్యారు. ఆ విజయంలో పీకే పాత్ర ఏమిటో, ఏమో కానీ, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. అంతే కాదు, ఇప్పుడు బీజీపీని ఓడించడమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నారు. అలాగే, గతంలో పీకే పనిచేసిన కాంగ్రెస్, ఆప్, జేడీయూ, వైసేపీ పార్టీలతోనూ ఆయనకు ఇప్పుడు సస్సంబంధాలు లేవు. వైసీపీలో జగన్ , షర్మిల మధ్య చిచ్చు పెట్టింది కూడా పీకేనే అంటున్నారు. ఇతరుల విషయం ఎలా ఉన్నా తృణమూల్’తో పీకే హనీమూన్ ముగిసిందని, అలాగే, ‘వ్యూహకర్త .. పీకే’ చరిత్ర చివరి అధ్యాయానికి చేరిందని అంటున్నారు.