హైదరాబాద్, ఫిబ్రవరి 24,
ఖర్చులకు డబ్బులు కావాలా..ఇంట్లో స్నేహితులను అడిగితే డబ్బులు ఇవ్వడం లేదా..లేకపోతే ఎవరినైనా చేబదులు అడగాలంటే సిగ్గుగా అనిపిస్తుందా? బ్యాంకుల చూట్టు తిరిగే ఓపిక లేదా? డోంట్ వర్రీ ఇకపై మీకు ఆ ఇబ్బంది లేదు….ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే సెకన్లలో ఆన్ లైన్ లో మీ ఎకౌంట్ కు డబ్బులిచ్చేస్తాం అంటున్నారు ఆన్ లైన్ పర్సనల్ లోన్ యాప్ నిర్వాహకులు. ఇదేదో ప్రజాసేవ కాదు….మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని పీక్కుతినే మైక్రోఫైనాన్స్ లాంటి దిక్కుమాలిన ఆన్ లైన్ మనీ ఇంట్రస్ట్ వ్యాపారం..ఇప్పడు ఈ యాప్ ల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం తెలుగు రాష్టాల్లో జనాల ప్రాణాలు తీసే కొత్తరకం వ్యాపారం ప్రారంభం అయింది. పబ్జీలు. ఆన్ లైన్ రమ్మీలకంటే అత్యంత ప్రమాదకరమైన మనీ ఇంట్రస్ట్ యాప్ ల వ్యాపారం. స్టూడెంట్లు, బ్యాచిలర్లు, నిరుద్యోగులే వీరి టార్గెట్. జస్ట్ ఆధార్ కార్డ్..పాన్ కార్డ్ ఉంటే చాలు డబ్బులు ఆన్ లైన్లో అప్పు ఇచ్చేస్తారు. వేయి రూపాయల నుంచి రెండులక్షల వరకూ అప్పు ఇచ్చేస్తారు.. అలా ఇవ్వాలంటే పదిమంది షూరిటీ అడుగుతారు..షూరిటీ అంటే వాళ్ల నుంచి సంతకాలు ఏవీ అవసరం లేదు. వాళ్ల కాంటాక్ట్ నెంబర్లు ఇస్తే చాలు..సెకన్లలోనే ఎకౌంట్లో డబ్బులు పడిపోతాయి..తీరా డబ్బులు వెనక్కి చెల్లించడం ఆలస్యమైతే అసలు కథ మొదలవుతుంది.ఎవరి ఫోన్ నంబర్లు తీసుకున్నారో వారందరికీ వాట్సాప్ లో మెసేజ్ లు పంపుతారు.. మీరు ఫలానా వారికి షూరిటీ ఉన్నారు. ఆ డబ్బులు వెంటనే కట్టకపోతే మా మనుషులు మీ ఇంటికి వస్తారు.. మీమీద కేసు పెడుతున్నామని, కేసు పెడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షపడుతుందో అన్ని వివరాలతో వాట్సాప్ కు మెసేజ్ పంపుతారు. అంతేగాదు లోన్ ఎవరు తీసుకున్నారో వారి పేరు ఫోన్ నంబర్ , అడ్రస్ తో సహా అన్ని వివరాలు పంపుతారు. నిజానికి ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తికి లోన్ తీసుకున్న వ్యక్తికి అసలు సంబంధం కూడా ఉండకపోవచ్చు. అయినా మెసేజ్ వస్తుంది..ఇదో మానసిక వ్యధ.. ఆ కోపంలో మెసేజ్ అందుకున్న వ్యక్తి లోన్ తీసుకున్న వ్యక్తి నంబర్ కు కాల్ చేసి తిడతారు.నా నంబర్ ని మీరు ఎందుకు షూరిటీ పెట్టారు అని..ఇలా పదిమంది ఆ లోన్ తీసుకున్న వ్యక్తికి పదేపదే కాల్ చేసి విసిగిస్తే లోన్ తీసుకున్న వ్యక్తి మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు.విశాఖ జిల్లా గాజువాకలోనూ యువతి ఆత్మహత్యకు పాల్పడింది..ఇప్పుడు ఆన్ లైన్ లో విపరీతంగా జరిగిపోతున్న చట్టవిరుద్ధమైన వ్యాపారం ఇది.. వందల కోట్లలో ఈ వ్యాపారం గుట్టుగా సాగిపోతోంది. ఇందులో మరి యాప్ నిర్వాహకులకు లాభం ఏంటి అంటే..ఆ యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల ఆదాయం వస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ముందుగానే తీసుకున్న లోన్ లో డబ్బులు కట్ చేస్తారు. అలాగే.. ఒకటి నుంచి మూడుశాతం వడ్డీవసూలు చేస్తారు. చిన్నచిన్న ఎమౌంట్ అనుకున్నప్పటికీ.. పెద్దపెద్ద వ్యాపారం జరుగుతుంది. లాక్ డౌన్ లో చేతి ఖర్చులకు ఇబ్బంది పడిన అనేకమంది ఇలాంటి యాప్ ల బారిన పడుతున్నారంటున్నారు టెక్నికల్ ఎక్స్ పర్ట్స్..ఇదంతా మైండ్ గేమ్ అంటున్నారు.యాప్ ల యందు ఈ యాప్ ల తీరువేరయా..అన్నట్టుగా ఉంటుంది ఈ ఆన్ లైన్ లోన్ యాప్ ల పరిస్థితి. జనాల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి అప్పులిచ్చి పీక్కు తినే వ్యవహారం..గతంలో సుప్రీంకోర్టు నిషేధించిన మైక్రోఫైనాన్స్ లాంటిదే ఈ యాప్ ల వ్యాపారం కూడా..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండానే వందల యాప్ లు ఇలా వ్యాపారం చేసేస్తున్నాయి.. ఆన్ లైన్ లో ఎక్కడ చూసినా ఈ యాప్ లే కనిపిస్తాయి..గూగుల్ ప్లేస్టోర్ లో, యాప్ స్టోర్ లో ఈ యాప్ లు దర్శనమిస్తాయి.. మనీ బాక్స్, మనీ కింగ్, క్యాష్ ట్రెయిన్, క్యాష్ సూపర్, మనీ ట్యాప్, పే సెన్స్,ధని,మనీలెండ్స్,క్రెడిట్ బీ, క్యాష్ ఈ, మనీవ్యూ, ఎర్లీసేలరీ, స్మార్ట్ కాయిన్, లేజీపే, ఎనీటైమ్ లోన్స్, ఎమ్ పాకెట్, ఫ్లెక్స్ సేలరీ, రూపీ ఇలా చెప్పుకుంటూ పోతే వందల లోన్ యాప్ లు కనిపిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు ఎక్కువగా ఈ యాప్ లను వినియోగిస్తున్నారు. ఇలాంటివి అస్సలు నమ్మొద్దని ఇదంతా ఇల్లీగల్ వ్యాపారం అంటున్నారు ఆర్థిక నిపుణులు.నిత్యం పోలీసులకు ఈయాప్ లపైనా రికవరీ టీంలపైనా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. తిరుపతిలోని ఒక సంస్థలో పని చేసే యువకుడికి ఈయాప్ ల ద్వారా తీసుకున్న లోన్ తిరిగి చెల్లించకపోవడంతో ఆతడి స్నేహితులందరికీ ఇలాగే రికవరీ టీం నుంచి మెసేజ్ లు వస్తున్నాయి. దీంతో వారంతా తిరుపతి పోలీస్ స్టేషన్ ల చుట్టు తిరుగుతున్నారు. పోలీసులు మాత్రం ఇటువంటి వాటికి ఎవరు భయపడాల్సిన పనిలేదంటున్నారు..పోనీ తెలిసిన వారు అప్పు తీసుకుంటే వారి ఫోన్ లో తమ కాంటాక్ట్ నంబర్స్ ఉన్నందుకు తమకు మెసేజ్ లు వచ్చాయంటే ఏదోలే అనుకోవచ్చు.కానీ అసలు సంబంధమే లేకుండా మెసేజ్ లు వస్తున్నాయి. లోన్ చెల్లించకుంటే మీ పై కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. పోలీసులు మాత్రం చాలామంది ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు…ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తప్ప… మేసేజ్ వచ్చిన వారు ఎవరు భయపడాల్సిన పని లేదని ధైర్యం చెబుతున్నారు.ఒకవేళ మరింత ఒత్తిడి చేస్తే సమీపంలో స్టేషన్ లో ఫీర్యాదు చేయాలంటున్నారు. ఇలాంటి యాప్ లు నిషేధించకపోతే భవిష్యత్తులో ఆత్మహత్యలు మరెన్నో చూడాల్సిన ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు నిపుణులు.