రోజుకు ఒక్క సిగరెట్ తాగినా గుండె జబ్బుల ప్రమాదం పొంచే ఉందంటున్న శాస్త్రవేత్తలు
ఓ మనిషి ఆరోగ్యాన్ని జీవన విధానం, ఆహారపుటలవాట్లు ఎంతగానో ప్రభావితం చేస్తాయనడానికి ఎన్నెన్నో నిదర్శనాలున్నాయి. అందులో మహా చెడ్డ అలవాటు ధూమపానం. సిగరెట్లు తాగడం వల్ల ఎన్నెన్నో దుష్పరిణామాలు వస్తాయని అందరికీ తెలిసిందే.
గుండెపోటు, మధుమేహం, కేన్సర్, సంతానలేమి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు దాని వల్ల తలెత్తుతాయి. అయితే, తాగే రెండు మూడు సిగరెట్లకే అన్ని దుష్పరిణామాలు వస్తాయా..? అని అనుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ, రోజుకు ఒక్క సిగరెట్ కాల్చినా భవిష్యత్‌లో గుండె జబ్బులు ఖాయమని తేల్చి చెబుతున్నారు పరిశోధకులు.
రోజుకు 20 సిగరెట్లు కాలిస్తే వచ్చే ముప్పులో.. అందులో సగం ముప్పు ఒక్క సిగరెట్ కాల్చినా వస్తుందని చెబుతున్నారు. కాబట్టి సిగరెట్ల సంఖ్యను తగ్గించడానికి బదులు దానికి పూర్తిగా చెక్ పెట్టేయాలని హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (యూసీఎల్)కు చెందిన పరిశోధకులు ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజుకు ఒకటి తాగినా, రెండు సిగరెట్లు పీల్చినా.. చేతుల్లో అదే పనిగా సిగరెట్లు పెట్టుకుని చైన్ స్మోకింగ్ చేసినా.. దుష్ఫలితాలు మాత్రం ఒక్కటే అని చెబుతున్నారు. 20 సిగరెట్లు తాగిన వారితో పోలిస్తే.. రోజుకు ఒక్క సిగరెట్ తాగిన వారికీ 46 శాతం గుండె జబ్బులు వచ్చే ప్రమాదముందని, 41 శాతం గుండెపోటు ముప్పు ఉంటుందని హెచ్చరించారు. అదే మహిళల్లో ఆ ముప్పు తీవ్రత 31 శాతం, 34 శాతంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.