హైదరాబాద్, ఫిబ్రవరి 24,
బండి సంజయ్ నేతృత్వంలో పలువురు బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పెద్దలతో కీలక మంతనాలు జరుపుతున్నారు. హస్తినలో లోటస్ ఎమర్జెన్సీ మీటింగ్‌పై ఆసక్తితో పాటు ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే.. అది అంతటి కీలక భేటీ అంటున్నారు మరి. ఢిల్లీలో కమలనాథుల మీటింగ్ గురించి ఆఫ్ ది రికార్డ్ పలు అంశాలు బయటకు వస్తున్నాయి. సౌత్ ఇండియాలో బీజేపీ మెయిన్ టార్గెట్ తెలంగాణనే. కాస్త కష్టపడితే.. బండి సంజయ్‌ను ఇంకాస్త పుష్ చేస్తే.. కేసీఆర్‌ను దెబ్బ కొడితే.. ఈసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమనే భావనలో ఉంది బీజేపీ అధిష్టానం. అందుకే, అమిత్‌షా, జేపీ నడ్డాలు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు ఇక్కడి అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు. బీజేపీ ఇంట్రెస్ట్ గుర్తించిన కేసీఆర్.. ఇటీవల కాలంలో మోదీపై, కేంద్రంపై, బీజేపీపై అంతెత్తున ఎగురుతున్నారు. అసహనంతో నోటికొచ్చినంతా మాట్లాడుతున్నారు. అక్కడితో ఆగకుండా.. పలు పార్టీలను కాషాయంపైకి ఎగదోసే పని కూడా చేస్తున్నారు. స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్‌లతో వరుస భేటీలు.. మమత బెనర్జీ, దేవెగౌడ తదితరులతో ఫోన్ మంతనాలతో తనవంతు సెగ రాజేస్తున్నారు. కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లొచ్చిన కొద్ది రోజులకే.. తెలంగాణ బీజేపీ నేతలంతా కలిసి ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ దూకుడుకు ఎలాగైనా కళ్లెం వేసేలా.. కమలనాథులంతా సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దమ్ముంటే అరెస్ట్ చేయండి? జైల్లో పెట్టండి చూద్దాం? అంటూ కేసీఆర్ పదే పదే కేంద్రానికి-బీజేపీకి సవాల్ విసురుతున్నారు. ఇక, బండి సంజయ్ సైతం సాక్షాలు ఉన్నాయి.. త్వరలోనే జైలు కెళతారంటూ.. కేసీఆర్‌ను కవ్విస్తున్నారు. అటు, పీసీసీ చీఫ్ రేవంత్ సైతం.. అనడం కాదు చేసి చూపించాలంటూ ఉడికిస్తున్నారు. ఇప్పటి వరకూ నడిచిన ఈ డైలాగ్ వార్.. ఇక యాక్షన్ టర్న్ తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాషాయాన్ని కాలరాయాలని చూడటంతో పాటు, బీజేపీకి వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు చుట్టొస్తున్న కేసీఆర్.. కాళ్లకు, చేతులకు, నోటికి సంకెళ్లు వేసే..వేయించే సమయం ఆసన్నమైందని అంటున్నారు. కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టేలా.. బండి సంజయ్ అంటున్నట్టు.. కేసీఆర్ సవాల్ చేస్తున్నట్టు.. త్వరలోనే ఆయనపై సీబీఐ, ఈడీ రైడ్స్ జరిపేందుకు ముహూర్తం ఫిక్స్ చేసేందుకే ఢిల్లీలో ఇలా అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసినట్టు హస్తిన వర్గాల సమాచారం. ఒకవేళ కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ రైడ్స్ జరిగితే.. తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది? ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తుతాయి? కేసీఆర్ రెచ్చగొట్టే చర్యలు ఎలా ఉంటాయి? ఆ పరిణామాలు బీజేపీకి ఎంత వరకూ లాభిస్తాయి? టీఆర్ఎస్‌కు ఎంత డ్యామేజ్ చేస్తాయి? ఆ సమయంలో తెలంగాణలో బీజేపీ శ్రేణులు పోషించాల్సిన పాత్ర ఏంటి? తదితర అంశాలపై కూలంకుశంగా చర్చిస్తున్నట్టు టాక్. యాక్షన్, డైరెక్షన్ సెట్ అయ్యాక.. మార్చి నెల చివరి నాటికి కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ రైడ్స్ జరగడం.. ఆయన్ను అరెస్ట్ చేయడం ఖాయమని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా.. లేటెస్ట్‌గా బండి సంజయ్ అండ్ టీమ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం ఉత్కంఠ రేపుతోంది.