ముంబై, ఫిబ్రవరి 25,
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. ఎప్పటిలా ఓ రూపాయో, రెండు రూపాయలో కాదు.. ఈసారి ధర భగభగ మండొచ్చు. మంత్లీ బడ్జెట్‌పై పెద్ద దెబ్బే కొట్టొచ్చు. సో.. బండి ఫుల్ ట్యాంక్ చేయించడం మర్చిపోవద్దు.ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో ధరలు పెంచేస్తారని ఎప్పటినుంచో అంటున్నారు. అదంతా నిజమే అయినా.. అంతకుముందే.. అంతకుమించి ధరలు పెరిగే గండం వచ్చిపడింది. అదే రష్యా-ఉక్రెయిన్ వార్. పొరుగు దేశంపై రష్యా ఒక్కసారిగి విరుచుకుపడటంతో అంతా షాక్. ప్రపంచ తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాల్డ్ మార్కెట్స్ అన్నీ కుప్పకూలిపోయాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు పుతిన్ ఆదేశించడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ముడిచమురు ధర ఒక్కసారి భగ్గుమంది. దాదాపు ఏడేళ్ల తర్వాత పీపా చమురు ధర 100 డాలర్లను దాటేసింది. ఆసియా స్టాక్ మార్కెట్లు మొత్తం 2 నుంచి 3శాతం వరకు నష్టపోయాయి. ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర రష్యా దళాల మోహరింపులు మొదలైన నాటి నుంచి చమురు ధరలు వేగంగా పెరుగుతూ వచ్చాయి.అంతర్జాతీయంగా బ్యారెట్ రేట్ పెరగడంతో.. రిటైల్ ధరలూ భారీగా పెరగడం ఖాయం. ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్‌లో రష్యాది కూడా కీలక భాగస్వామ్యం. రష్యా ఎగుమతులు ఆపేస్తే.. ఆయిల్‌కు డిమాండ్ పెరుగుతుంది. ఆ మేరకు ముడిచమురు ఉత్పత్తి దేశాలు ధరలు పెంచేస్తాయి. ప్రధానంగా దిగుమతుల మీదే ఆధారపడిన భారత్‌లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఏ క్షణంలోనైనా పెరిగే అవకాశం ఉంది. ఇక, రష్యా చర్యలపై పశ్చిమ దేశాల స్పందనల ఆధారంగా చమురు ధరల్లో మార్పులు ఉండొచ్చు.