ముంబై, ఫిబ్రవరి 25,
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. హోరాహోరీగా యుద్ధం సాగుతోంది. అయితే మనకేం! వాళ్లు వాళ్లు యుద్ధం చేసుకుంటున్నారు.. మనకేం నష్టం-కష్టం లేదుగా అని భారతీయులు బిందాస్‌గా ఉండలేని పరిస్థితి. ప్రస్తుత గ్లోబలైజేషన్‌లో ఏ చిన్న కంట్రీకి ఇబ్బంది వచ్చినా.. ఆ ప్రభావం యావత్ ప్రపంచ దేశాలపై ఎంతో కొంత ఉండకమానదు. అలాంటిది.. రష్యా లాంటి పెద్ద దేశం యుద్ధానికి దిగితే.. ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. అందులోనూ దిగుమతులపై భారీగా ఆధారపడే ఇండియాకు అది మైనస్సే.
లేటెస్ట్‌గా.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. గురువారం భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర 51 వేలు దాటేసింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడి విలువ 2.02 శాతం పెరిగి.. రూ.51,396కి చేరింది. వెండి ధరలో కూడా 2 శాతం పెరుగుదల నమోదైంది. కిలో సిల్వర్ రేట్.. 65,876కు పెరిగింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. దీంతో.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు మదుపరులు. ఆ మొత్తాన్ని బంగారంపై పెడుతున్నారు. గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరగడంతో.. ధర కూడా పెరుగుతోంది. బంగారం ఒక్కటే కాదు.. ఆయిల్ కూడా బంగారమే అవుతోంది. డాలర్ విలువ సైతం పైపైకి పోతోంది. యుద్ధం ఆగే వరకూ.. బంగారం ధర మరింత ప్రియమే.