YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ హస్తిన..డైలీ సిరియల్...

కేసీఆర్ హస్తిన..డైలీ సిరియల్...

హైదరాబాద్, ఫిబ్రవరి 25,
ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్న, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ ప్రయాణం మరో వెనకడుగు వేసిందా? ముంబై వెళ్లి వచ్చిన తర్వాత అయన ధోరణిలో మార్పు కనిపిస్తోందా?  ఇంతవరకు, కేంద్రం ఫై పోరాటంలో అందరినీ కలుపుకు పోతానని, త్వరలోనే హైదరాబాద్’ లో కాంగ్రెస్, బీజేపీయేతర ముఖ్యమంత్రులు ,కీలక నేతల సమావేశం ఉంటుందని , ప్రకటించిన కేసీఆర్, మల్లన్నసాగర్’ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సభలో కేంద్రంపై ఒంటరి పోరాటానికి సిద్డమవుతున్నసంకేతాలు ఇచ్చినట్లుందని అంటున్నారు.
కేసీఆర్ ముంబై వెళ్లి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత  ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ ఏర్పాటు గురించి  సుదీర్ఘ మంతనాలు సాగించి వచ్చిన విషయం ఎలిసిందే.  అయితే, ఆ తర్వాత కొద్ది గంటలకే, శివసేన కీలక నేత, రాజ్య సభ సభ్యుడు, సంజయ్‌ రౌత్‌ కాంగ్రెస్‌ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కాంగ్రె్‌సకు కొత్త కూటమిలో చోటు ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. అంతకు ముందే డిఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్’ కూడా ఇంచు మించుగా అదే విధంగా, ‘కాంగ్రెస్ తోనే కూటమి’ అని కుండ బద్దలు కొట్టారు. దీంతో కేసీఆర్, రూట్ మార్చినట్లు ఉందని అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలకు కొత్త రూట్ ఎంచుకున్నారా? ఉమ్మడి పోరాటాన్ని వంటరి పోరాటంగా మార్చుకున్నారా? అందుకేనా మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌ అరెస్ట్ విషయంలో , మౌనంగా ఉండి పోయారు? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి, కేసీఆర్ నైజం తెలిసిన ఎవరైనా, మాలిక్ అరెస్ట్ విషయంలో కేసీఆర్ ఇమ్మీడియేట్ ‘ రియాక్ట్ ‘ అవుతారని అనుకుంటారు. కానీ అదేమీ జరగలేదు. కేసీఆర్ మాత్రమే కాదు , తెరాస నాయకులు  ఎవరు కూడా పెదవి విప్పలేదు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో మరో టర్న్’ తీసుకున్నారనే సందేహాలు వ్యక్త మవుతున్నాయి.
మరో వంక  నవాబ్‌ మాలిక్‌ అరెస్ట్ విషయంలో, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, బేజేపీ వ్యతిరేక కూటమి కీలక నాయకురాలు మమతా బెనర్జీ చాలా ఘాటుగా స్పందించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్’కు ఫోన్ చేశారు. పది నిముషాలకు పైగా పవార్’తో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, ఈ విషయంలో  ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ  ఇచ్చారు. మాలిక్’ను మంత్రి వర్గం నుంచి తప్పించ వద్దని, సలహా ఇచ్చారు. ఎన్సీపీకి సంఘీ భావం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం  దర్యప్తు సంస్థలను దుర్వినియోగంపై అందరం ఏకమై పోరాటం చేద్దామని పిలుపు నిచ్చారు.  మమతా బెనీర్జీ, మాలిక్ అరెస్ట్ ఉదంతంలో అంతలా స్పదించినా, కొద్ది రోజుల క్రితమే శరద్ పవార్’ను కలిసి బీజేపీ వ్యతిరేక కూటమి గురించి గంటల తరబడి చర్చలు జరిపిన కేసీఆర్, మాలిక్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? కాంగ్రెస్’ తోనే కూటమి అని మహా నాయకులు స్పష్టం చేయడమే, కేసీఆర్ మౌనానికి కారణమా ? లేక మాలిక్ అరెస్ట్’తో కేసేఆర్ భయం డబుల్ అయిందా? అందుకే ఆయన మౌనాన్ని ఆశ్రయించారా? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది? ఏమైనా కేసీఆర్ ఢిల్లీ రాజకీయం, డైలీ సీరియల్’ లాగా   ఆసక్తికర  మలుపులు తిరుగుతోందని అంటున్నారు.

Related Posts