YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఊరించి... ఊసూరుమనిపించిన సీఎం

ఊరించి... ఊసూరుమనిపించిన సీఎం

మెదక్, ఫిబ్రవరి 25,
సిద్దిపేటలో పర్యటించిన ప్రతీ సారి సీఎం కేసీఆర్ తనదైన శైలిలో నిధుల వర్షం కురిపిస్తుంటారు. ప్రజాప్రతినిధులే ఆశ్చర్యపోయేలా వారు అడిగిన దానికంటే ఎక్కువే నిధులు కుమ్మరిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా సీఎం కేసీఆర్ తన సొంత గడ్డపై పర్యటిస్తున్న సమయాన మరోమారు పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రత్యేకంగా భారీగా నిధుల వర్షం కురిపిస్తారని భావించారు.మల్లన్నసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభలో కేవలం మల్లన్నసాగర్ పాటు మరో నాలుగు ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారే తప్పా జిల్లాలోని సమస్యలు, వాటికి నిధుల కేటాయింపు గురించి ఏ మాత్రం ప్రస్తావించలేదు. కేవలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తీరు, జాతీయ రాజకీయాలపై మాట్లాడి తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. దీనిపై జిల్లా ప్రజలందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సీఎం కేసీఆర్ సిద్దిపేట టూర్ నిరాశ పరిచింది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం 499 గ్రామాలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. సొంత గడ్డ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తారని ఆశించారు. సంగారెడ్డి లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన సందర్భంగా ఆ జిల్లాకి వరాల జల్లు కురిపించిన మాదిరిగా సిద్దిపేటకి కేటాయిస్తారని జిల్లా ప్రజాప్రతినిధులు గంపెడాశలతో సీఎం పర్యటన కి వెళ్ళారు.సీఎం కేసీఆర్ కి ముందు ప్రసంగించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు జిల్లా సమస్యలు వివరించి, జిల్లా మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు గాను నిధులు కోరడం, వెనువెంటనే సీఎం మంత్రి కోరిక మేరకు నిధులు మంజూరు చేసే వారు. ఈ సారి కూడా సీఎం ప్రసంగం ముందు మంత్రి మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతారనుకున్నారంతా కానీ అదేమీ జరగలేదు. మంత్రి సైతం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పడ్డ ఇబ్బందులు, ప్రారంభోత్సవ సంతోషాలపై ప్రసంగించి వదిలేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సైతం మంత్రి ఎలాంటివి అడక్కపోవడంతో నిధులేమి మంజూరు చేయలేదు. దీనిపై యావత్తు జిల్లా ప్రజానీకం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ పర్యటనలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాకలో నెలకొన్న ప్రధాన సమస్యలైనటువంటి రోడ్ల మరమ్మత్తులు, భూంపల్లి మండల ఏర్పాటుతో పాటు నూతనంగా ఏర్పడ్డ మండలాలు, గ్రామ పంచాయతీల్లో పక్కా భవనాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన మాదిరిగా నష్ట పరిహారం అందించాలని కోరారు.దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రసంగంలోనైనా ఎమ్మెల్యే కోరిన అంశాలకు సానుకూలంగా స్పందిస్తారని భావించారు. కానీ దుబ్బాక ఎమ్మెల్యే కోరిన ఏ ఒక్క మాటను కూడా కేసీఆర్ తన ప్రసంగంలో మాట్లాడకపోవడం పై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మా ప్రాంతానికి వచ్చిన సందర్భంలోనూ మా ప్రాంత అభివృద్ధికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేవలం సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టును సినిమా షూటింగ్‌కు కేంద్రంగా మార్చాలని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, హరీశ్ రావులను కోరారు. ఇందుకోసం మల్లన్నసాగర్‌తో పాటు రంగనాయకసాగర్, అన్నపూర్ణ, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టుల పర్యాటక అభివృద్ధికి మాత్రం రూ.1500 కోట్లు మంజూరు చేశారు. వీటితో మల్లన్న సాగర్ వద్ద ఇంజనీరింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ .100 కోట్లు మంజూరు చేశారు.ఇది సంతోషించ దగ్గ విషయమే కానీ మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన భూ నిర్వాసితులకు మాత్రం ఉపాధి మార్గం చూపిస్తామని చెప్పారే తప్పా వారికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పలేదు. దీనిపై భూ నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారే కాదు జిల్లా ప్రజానీకమంతా సీఎం కేసీఆర్ పర్యటనపై నిరాశను వ్యక్తం చేస్తుంది. వచ్చే నెలలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లోనైనా జిల్లాకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి నిధులు భారీగా కేటాయించాలని కోరుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Posts