హైదరాబాద్, ఫిబ్రవరి 25,
రాష్ట్రంలో ఎన్నికల వ్యూహకర్తలు మకాం వేస్తున్నారు. రాజకీయ పార్టీలు సర్వే సంస్థలను రంగంలోకి దింపుతున్నాయి. అయితే, గతంలో సొంత వ్యూహాలతో టీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన కేసీఆర్.. ఈసారి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పార్టీ వర్గాలే ఒప్పుకుంటున్నాయి. ఇప్పటి వరకు తమకు పీకేలు అవసరం లేదని, కాంగ్రెస్ కార్యకర్త ఒక్కో పీకేతో సమానం అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే మొన్నటి దాకా ప్రశాంత్ కిషోర్తో కలిసి పని చేసిన సునీల్కనుగోలు (ఎస్కే)ను రంగంలోకి దింపుతోంది. ఈ మేరకు ఏఐసీసీ కీలక నేత సమక్షంలో ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో అతి త్వరలోనే కాంగ్రెస్ పక్షాన ఎస్‌కే టీం రంగంలోకి దిగుతోంది. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా కర్ణాటకకు కూడా సునీల్ కనుగోలు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు.2014లో విదేశాల నుంచి దేశానికి వచ్చిన సునీల్ కనుగోలు ముందుగా ప్రశాంత్ కిషోర్తో కలిసి ఐప్యాక్లో పని చేశారు. వీరిద్దరి వ్యూహాలు బీజేపీకి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మేరకు కలిసి వచ్చాయి. అంతేకాకుండా అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ (ఏబీఎం) ఆధ్వర్యంలో బీజేపీకి సునీల్ కనుగోలు వార్ రూంను నడిపించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ మరియు కర్నాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఎన్నికల వ్యూహాల్లో సునీల్ కీలకంగా పని చేశారు. అంతకు ముందు తమిళనాడులో 2016లో డీఎంకేకు పని చేశారు. పీకే ఆధ్వర్యంలోనే సునీల్ తమిళనాడులో వ్యూహాలు అమలు చేశారు. డీఎంకే అధినేత స్టాలిన్ కోసం ‘నమక్కు నామే’ (మనకోసం మనం) అంటూ ఒక ప్రత్యేక ప్రచారాన్ని రూపొందించిన ఘనత సునీల్దే.ఏపీకి చెందిన సునీల్ కనుగోలు కుటుంబం చాల ఏండ్ల కిందటే చెన్నైలో స్థిరపడింది. అక్కడ పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. 2018లో పీకేతో కలిసి ఉన్న ఎస్కే.. టీఆర్ఎస్‌కు పని చేశారు. ప్రశాంత్ కిశోర్ ప్రధాన శిష్యుడని, ఐప్యాక్ టీమ్‌లో కీలక సభ్యుడని తేలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌కు సునీల్ రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. ఆ సమయంలో టీఆర్ఎస్ సోషల్ మీడియాను పూర్తిగా నడిపించారు.రెండు పర్యాయాలు సొంత వ్యూహాలతోనే టీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ ఈసారి పీకే సాయం తీసుకోవడంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలమైనట్లుగా భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి. గతంలో లేని విధంగా అధికార టీఆర్ఎస్ విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అటు కొంతకాలంగా బీజేపీ పుంజుకుంటున్నట్లుగా ఉండగా, టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. అయితే, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలుపు తరువాత బీజేపీ మరింత స్పీడ్ పెంచింది. టీఆర్ఎస్‌ను టార్గెట్‌గా పెట్టుకుంటూనే కాంగ్రెస్పైనా ఫోకస్ చేస్తోంది. ఇక తాజా పరిణామాల్లో బీజేపీ అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కీలకంగా తీసుకోగా.. రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్పై రేవంత్ వర్గం దూకుడు పెంచింది. ఎన్నికల సమయానికి బీజేపీని పాత స్థానానికి పరిమితం చేసి, టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యర్థిగా ఎదగాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీకే టీంతో కసరత్తు చేస్తుంటే.. తాజాగా కాంగ్రెస్ కూడా అదే దారిని ఎంచుకుంది.ముందు నుంచీ ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ బృందంలో కీలకంగా ఉన్న వారితోనే పార్టీలు అగ్రిమెంట్చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అదే ఎజెండాతో సాగుతున్నాయి. పీకేను టీఆర్ఎస్పార్టీకి వ్యూహకర్తగా తీసుకుంటే.. ఐప్యాక్లో రెండో మెంబర్గా ఉన్న సునీల్ కనుగోలుతో కాంగ్రెస్ఒప్పందం చేసుకుంటోంది. పీకే శిష్యుడిగా ఉంటూ, 2020 నుంచి వేరుగా వ్యవహరిస్తున్న ఎస్‌కేతో ముందుకు సాగాలని ఏఐసీసీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు వైఎస్సార్టీపీ కూడా ఐప్యాక్ సభ్యురాలు ప్రియాతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.రాష్ట్ర రాజకీయాలు ఇద్దరు వ్యూహకర్తల మధ్యకు చేరాయి. గతంలో ఒకే దగ్గర పని చేసిన పీకే, ఎస్కే ఇప్పుడు వేర్వేరు పార్టీలకు వ్యూహకర్తలుగా వ్యవహరించనున్నారు. ఇప్పటి దాకా అధికారంలో ఉన్న పార్టీకి పీకే సాయంగా ఉండగా, ఏడేండ్ల నుంచి అచేతన స్థితిలో ఉన్న కాంగ్రెస్కు సునీల్ వ్యూహాలు అందించనున్నారు. ఇప్పుడిప్పుడో జోష్ వస్తున్నా సొంత పార్టీ నేతల తిరుగుబాట్లతో కాంగ్రెస్ కలహాల్లోనే కాలం వెళ్లదీస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరుగుతుందని పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా సర్వేలు చేయించుకున్నాయి. దీంతో టీఆర్ఎస్పై వ్యతిరేకతతో పాటుగా ఇరు పార్టీలకు అనుకూలంగా ఉందనే విషయాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే సర్వే వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఏఐసీసీ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణతో పాటుగా కర్ణాటక రాష్ట్రాల ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమించుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి. త్వరలోనే ఆయన బృందం రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేయనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో నేతల మధ్య సయోధ్యతో పాటు పార్టీ ఎలా వ్యవహరించాలనే అంశంపై సునీల్ సూచనలు కీలకమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్.. టీఆర్ఎస్‌కు పనిచేయడం కూడా కాంగ్రెస్కు కొంత కలిసి వచ్చే అంశమే. రాష్ట్రంలో ఒక విధమైన రాజకీయ వాతావరణం హీటెక్కుతున్న నేపథ్యంలో పీకే, ఎస్‌కే వ్యూహాలతో రాజకీయాలు ఎలా మారుతాయో చూడాల్సిందే