YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

పుతిన్ కు నిరసన సెగ

పుతిన్ కు నిరసన సెగ

మాస్కో, ఫిబ్రవరి 25,
దేశ భద్రతకు ప్రమాదం పొంచిఉందని ఆరోపిస్తూ ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా స్వదేశంలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అభినవ హిట్లర్‌గా అభివర్ణిస్తూ.. భారీస్థాయిలో రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిరసనకారులు. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ.. భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. దేశ రాజధాని మాస్కో రోడ్లన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. మాస్కోలోని ప్రధాన వీధుల్లో దాదాపు 1,000 మందికిపైగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. యుద్ధం వద్దంటూ నినదించారు. మరికొందరైతే.. పుతిన్ ఫోటోను హిట్లర్ మాదిరిగా మార్ఫింగ్ చేసి ప్రదర్శించారు.మాస్కోలోని చారిత్రక గోస్టినీ డ్వోర్ షాపింగ్ ఆర్కేడ్ వెలుపల ఉన్న సెయింట్ పీటర్స్‌బర్గ్‌తో సహా అనేక ఇతర నగరాల్లో కూడా నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. భారీ పోలీసు బందోబస్తు నేపథ్యంలో కొద్ది మంది కేకలు వేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రష్యాలోని 54 నగరాల్లో దాదాపు 1,745 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 957 మంది మాస్కో నుంచి అదుపులోకి తీసుకున్నారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.1979లో ఆఫ్ఘనిస్తాన్‌పై సోవియట్ దండయాత్ర తర్వాత.. రష్యా చేపట్టిన ఈ దూకుడు చర్యలను ఖండిస్తూ వేలాదిమంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని పౌరులను ‘‘మారణహోమం’’ నుండి రక్షించడానికే ‘‘ప్రత్యేక సైనిక చర్య’’కు దిగడం జరిగిందని పేర్కొన్నారు. కానీ, రష్యన్లు మాత్రం ప్లుతిన్ వాదనను ఏమాత్రం అంగీకరించడం లేదు. యుద్ధం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో సైరన్‌లు మోగడం, భారీ స్థాయిలో పేలుళ్లు జరుగుతుండటంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ ఎక్కడ సురక్షితం అనిపిస్తే అక్కడ తలదాచుకుంటున్నారు. ఎన్నో బిల్డింగ్‌లు నేలమట్టం అయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ హృదయ విదారక దృశ్యాలు రష్యన్లను సైతం తీవ్రంగా బాధించింది. అందుకే పుతిన్ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. యుద్ధం ఆపేయాలంటూ రకరకాలుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ లేఖలు, సందేశాలు, ఆన్‌లైన్ పిటిషన్లతో దాడులను ఆపాలని కోరుతున్నారు.

Related Posts