హైదరాబాద్, ఫిబ్రవరి 25,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్’కు లేఖ రాశారు. అయితే ఆయన లేఖ రాసింది, కేటీఆర్’కే అయినా, అందులోని అక్షరాలు గుచ్చుకున్నది మాత్రం, ఎవరికో వేరే చెప్పనక్కరలేదు. అవును, జగన్ రెడ్డికే అయన పరోక్షంగా చురకలు అంటించారు. 2014 నాటి ఎన్నికల గాయాన్నిగుర్తుచేసుకుని జగన్ రెడ్డి ఇప్పటికీ పవన్ కళ్యాణ్’పై పగ సాధిస్తూనే ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్’లో సినిమా రంగాన్ని తన కాలి కింద చెప్పులా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్ చెప్పులో రాయిలా గుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే అసలే పాత పగతో రగిలిపోతున్న జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం విడుదల విషయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అవరోధాలు సృష్టిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే, సినిమా హాల్స్’పై దాడులు చేయించారు. సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు సినిమా ఇండస్ట్రీతో డీల్ కుదుర్చుకున్నా, ‘భీమ్లా నాయక్’ విడుడలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇంకా అనేక విధాల వేధింపులకు గురి చేస్తున్నారు.ఈ నేపద్యంగా హైదరాబాద్’లో జరిగిన ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్’లో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను, సినిమా పరిశ్రమకు ఇచ్చిన ప్రోత్సాహాన్నీ, ప్రస్తుతిస్తూ పవన్ కళ్యాణ్ మంత్రికి రాసిన లేఖ ద్వారా జగన్ రెడ్డికి చురకలు అంటించారు. అందులో ఆయన, “ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలి ” అని పేర్కొన్నారు. ఇక్కడ ఆయన ప్రత్యక్షంగా, జగన్ రెడ్డిని ఏమీ అనలేదు కానీ, ‘తెలంగాణ నేతలకు’అని ప్రత్యేకించి చెప్పడం ద్వారా, ఏపీ నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పకనే చెప్పారు. రాజు గారి పెద్ద భార్య మంచిదంటే, రెండవభార్య గురించి చెప్పనక్కర లేదు కదా .. అలాగే, పవన్ కళ్యాణ్ “ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలి ”అని అన్నారంటే ఏపీ పాలకులకు ఆ సంస్కారం లేదని చెప్పడం గానే అర్థం చేసుకోవాలని అంటున్నారు. నిజానికి, రాజకీయంగా పవన్ కళ్యాణ్’ కు మొదటి నుంచి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పట్ల కొంత ప్రత్యేక గౌరవం ఉన్న మాట నిజం. అయినా ఆయనకు తెరాస నాయకులకు మధ్య పెద్దగా సయోధ్యత, స్నేహ సంబంధాలు లేవు. పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఒకరి నొకరు దూషించుకున్న సందర్బాలున్నాయి. అలాగే, పవన్ కళ్యాణ్, కేసేఆర్ కూడా ఒకరినొకరు దూషించుకున్నారు. ఒకరు తాట తీస్తానంటే, ఇంకొకరు ముక్కలు, ముక్కలుగా నరుకుతా’ అన్నారు. అందుకే, పవన్ కళ్యాణ్” కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి కుల, మత, భాష, ప్రాంతీయ బేధాలుండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండైన హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని లేఖలోపేర్కొన్నారు. అంటే, పవన్ కళ్యాణ్ లేఖ రాసింది తెలంగాణ మంత్రి కేటీఆర్ కైనా, వాతలు పెట్టింది మాత్రం జగన్ రెడ్డికే.. అంటున్నారు విశ్లేషకులు.