తిరుమల, ఫిబ్రవరి 25,
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవల టికెట్ల ధరలను భారీగా పెంచేసింది టీటీడీ. దీంతో శ్రీవారి క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చేసిందనే ఆరోపణల జడివానను ఎదుర్కొంది. ఇప్పుడు తిరుమలలో ప్రైవేట్ హొటళ్లను రద్దు చేసింది. కొండకు వచ్చే భక్తులకు భోజన సదుపాయం లేకుండా చేసింది. శ్రీవారి అన్న ప్రసాదం ఉచితంగా అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న టీటీడీ పాలకమండలి తిరుమలకు పోటెత్తి వచ్చే భక్తులను గంటల తరబడి క్యూలైన్లలో నిలబెడుతోంది. ఇంతకు ముందు అన్న ప్రసాదం క్యూలైన్లో నిలబడే ఓపిక, సమయం లేని అనేక మంది భక్తులు ప్రైవేట్ హొటళ్లలో కూడా భోజనం చేసేవారు. వారికి ఆ సౌకర్యం లేదకుండా చేయడంతో భక్తులు ఒక పక్క లబోదిబోమంటూనే.. మరో పక్కన టీటీడీ పాలక మండలి నిర్ణయాన్ని తూర్పారపడుతున్నారు. టీటీడీ దుందుడుకు నిర్ణయం కారణంగా తిరుమలగిరుల్లో గోవింద నామాల కన్నా అన్నమో రామచంద్రా నినాదమే మారుమోగుతోంది.