రాజమండ్రి, ఫిబ్రవరి 26
ఖరీఫ్ (2021-22) సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 40లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించనుందని సమాచారం. ó5లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా ప్రకటించి ఇప్పుడు దానికి కోత పెడుతోందని తెలిసింది. ప్రభుత్వం ఇప్పటి వరకు పౌరసరఫరాల సంస్థ 35.23లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. మరో 5లక్షల టన్నులు సేకరించి ఖరీఫ్ ధాన్యం సేకరణను నిలిపేసే విధంగా చర్యలు ప్రారంభించనట్లు సమాచారం. ఇటీవల మంత్రి కొడాలి నాని ఓ ప్రెస్‌మీట్‌లో కూడా దాదాపు ధాన్యం సేకరణ పూర్తికావొచ్చిందని 45లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే లక్ష్యం పూర్తవుతుందని అన్నారు. ప్రస్తుతం సర్వర్లు మొరాయించడం దీనికి సంకేతమని రైతులు భావిస్తున్నారు. ఖరీఫ్ 2021-22కు సంబంధించి ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో 2021 నవంబర్‌లో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో 87లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, దీనిలో పౌరసరఫరాల సంస్థ 50 లక్షల టన్నులు సేకరించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు 2021 నవంబర్ 9న ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించిన ఆదేశాలు, నిబంధనావళిని ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో పేర్కొన్న అంచనాల ప్రకారం 2022 ఫిబ్రవరి 22 నాటికి 43,03,144 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తికావాల్సి ఉంది. మార్చి 22కు 50లక్షల టన్నుల లక్ష్యం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలు, ప్రకటనలకు భిన్నంగా ధాన్యం సేకరణలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం, మరో 15లక్షల టన్నుల సేకరణ చేయాల్సిఉండగా సర్వర్లు మొరాయింపు, మంత్రి ప్రకటన రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈనెల 21 సోమవారంనాడు రాష్ట్రంలో ఒక్క గింజ ధాన్యం కూడా సేకరించలేదు. గత వారంలో రోజుకు సరాసరిన ఐదు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణ జరిగింది. ఈ సీజన్‌లో డిసెంబర్, జనవరిలో కురిసిన అకాల వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల రైతులు వరి నూర్పిడిని వాయిదా వేసుకున్నారు. వాతావరణం సరయ్యేనాటికి మినుము పంట పూత, పిందె రావడంతో వరి నూర్పిడి చేయడానికి రైతులకు అవకాశం లేకుండా పోయింది. ఇలా ఇంకా వరి నూర్పిడి చేయని ధాన్యం రాష్ట్రంలో మరో 20లక్షల టన్నుల వరకూ ఉంటుందని అంచనా. ప్రభుత్వం ధాన్యం సేకరణ నిలిపేస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.
ధాన్యం సేకరణ పూర్తయిన 21 రోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉండగా ఆచరణలో అది జరగడం లేదు. సేకరణ ప్రారంభ సమయంలోనే జరిగిందని, రెండు నెలల తర్వాత అది జరగడంలేదని ఆర్‌బికె ఇన్‌ఛార్జ్‌లే చెబుతున్నారు. ధాన్యం సేకరణ ప్రారంభంలో సకాలంలో చెల్లింపులు చేసిన పౌరసరఫరాలసంస్థ, దాన్ని ఎందుకు కొనసాగించలేకపోతోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు 5,16,510 మంది రైతుల నుండి రూ.6,853కోట్ల విలువ గల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ సేకరించింది. వీటిలో దాదాపు సగం మొత్తం చెల్లించాల్సి ఉందని సమాచారం.