విజయవాడ, ఫిబ్రవరి 26,
పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారా? ఇప్పటి వరకూ మిత్రుడిగా కొనసాగుతున్న పవన్ కల్యాణ్ ఇకపై బీజేపీకి దూరం అవుతారన్న టాక్ వినపడుతుంది. ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వంటి అంశాలు కూడా పవన్ కల్యాణ్ బీజేపీతో కటీఫ్ చెప్పడానికి ఒక కారణంగా కన్పిస్తున్నాయి. నరసాపురంలో... ఇప్పటికే బీజేపీతో ఆయన దూరం జరిగినట్లు కన్పిస్తుంది. ఇటీవల నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో మత్స్య కార సభ పెట్టడానికి ప్రత్యేక కారణం ఉందంటున్నారు. నరసాపురం పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. వైసీపీ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఆయన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది.అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో నరసాపురం నుంచి తన సోదరుడు నాగబాబు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ స్థానం నుంచి మరోసారి తన పార్టీ నుంచే పోటీ చేయించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. బీజేపీలోకి రఘురామ కృష్ణ రాజు వెళితే, తన సోదరుడిని ఉప ఎన్నికల్లో పోటీకి దింపాలని పవన్ యోచిస్తున్నారంటున్నారు. అందుకే మత్స్యకారుల సభను కూడా నరసాపురంలో పెట్టారని చెబుతున్నారు. మరోవైపు బీజేపీతో మిత్రుడంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉండాలి. తెలంగాణలో మాత్రం పవన్ టీఆర్ఎస్ కు దగ్గరగా కనిపిస్తున్నారు. బీజేపీఃకి మద్దతుగా ఇక్కడ ఎటువంటి కామెంట్స్ చేయకపోగా, టీఆర్ఎస్ నేతలను పొగుడుతున్నారు. ప్రభుత్వం కూడా పవన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుంది. దీనిని బట్టి త్వరలోనే పవన్ కల్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పేయనున్నారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తుంది. ఆయన టీడీపీతో ఇప్పటికిప్పుడు నేరుగా పొత్తు పెట్టుకోక పోయినా ఆ పార్టీతోనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారని తెలుస్తోంది.