విజయవాడ, ఫిబ్రవరి 26,
అత్యాశ అసలుకే మోసం తెచ్చింది. అమాయకత్వం నట్టేట ముంచింది. లేటెస్ట్‌గా కృష్ణా జిల్లాలో జనాన్ని నమ్మించి వంచించింది ఓ సంస్థ. కోట్ల రూపాయలకు శఠగోపం పెట్టి ఉడాయించింది. తాజాగా కృష్ణా జిల్లాలో.. వెల్ఫేర్ గ్రూప్ సంస్థ చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గుడివాడ, నందివాడ, హనుమాన్ జంక్షన్, ముదినేపల్లి మండలాలకు చెందిన మహిళల చేత కోటి రూపాయల వరకు డిపాజిట్లు చేయించి పత్తా లేకుండా పోయింది. అగ్రిగోల్డ్ తరహాలో వెల్ఫేర్ గ్రూప్ సంస్థ కూడా ప్రజలకు శఠగోపం పెట్టిందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.వైజాగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వెల్ఫేర్ గ్రూప్ సంస్థ.. డిపాజిట్ల కాలపరిమితి ముగిసినా డబ్బులివ్వడానికి నిరాకరిస్తున్నారు కంపెనీ ప్రతినిధులు. గడువు ముగిసి నాలుగేళ్లు అవుతున్నా డిపాజిటర్లకు నయాపైసా చెల్లించలేదు. కొంతమందికి చెక్కులు ఇచ్చినప్పటికి అవి బౌన్స్ అవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిపాజిటర్లు. ఇప్పటికే గుడివాడలోని వెల్ఫేర్ గ్రూప్ కార్యాలయాన్ని మూసివేశారని.. వైజాగ్‌లోని హెడ్ ఆఫీసుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని చెబుతున్నారు డిపాజిటర్లు, ఏజెంట్లు.ఈ క్రమంలో డిపాజిట్ దారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఎజెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ గుడివాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు