YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కౌలుదారులకు ఈ క్రాప్ అడ్డు

కౌలుదారులకు ఈ క్రాప్ అడ్డు

ఏలూరు, ఫిబ్రవరి 26,
గతేడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల్లో నాల్గవ వంతు విస్తీర్ణానికి సర్కారీ పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అందలేదు. అన్ని జిల్లాల్లో కలుపుకొని 12.21 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ నిర్వహించిన క్షేత్ర స్థాయి పరిశీలనలో తేల్చగా, దాదాపు మూడు లక్షల ఎకరాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ దక్కలేదు. డ్యామేజి అయిన విస్తీర్ణంలో 9.19 లక్షల ఎకరాలకే పరిహారం అందింది. విపత్తు సహాయ నిబంధనల మేరకు 33 శాతం, అంతకంటే ఎక్కువ పంట నష్టం జరిగితే ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుంది. కాగా పూర్తిగా పంట పోయిందని ఎన్యూమరేషన్‌ బృందాలు గుర్తించినప్పటికీ ఇ-క్రాప్‌ పోర్టల్‌లో సరిగ్గా సాగులు నమోదు కానందున కళ్ల ముందు పంటలు డ్యామేజి అయినప్పటికీ పరిహారం ఇవ్వలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం పంట నష్టాలు నమోదు చేస్తే, ఆ సర్వే నెంబర్‌లో పండిన పంటలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోకి ఎంట్రన్స్‌ లేదని ప్రభుత్వం విధించిన కండీషన్‌కు భయపడ్డ కొంత మంది రైతులు ఇన్‌పుట్‌ సబ్సిడీ వదులుకున్నట్లు చెబుతున్నారు.నవంబర్‌ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు మొన్న 15న ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేసింది. 10.10 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, హార్టికల్చర్‌, సెరి కల్చర్‌ రైతులకు రూ.542 కోట్లు జమ చేసింది. ఒక్క వ్యవసాయ పంటలే 12,21,900 ఎకరాల్లో దెబ్బతిన్నాయని అప్పట్లోనే వ్యవసాయశాఖ అంచనాలు రూపొందించింది. వరి, వేరుశనగ, పత్తి, శనగ పంటలు అత్యధికంగా దెబ్బతిన్నాయి. కడప, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో డ్యామేజి ఎక్కువ జరిగింది. దాదాపు పది లక్షల టన్నుల వివిధ పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. పంట ఉత్పత్తుల డ్యామేజి విలువ రూ.2,779 కోట్లుగా అంచనా వేశారు.పంట నష్టం 12.21 లక్షల ఎకరాల్లోకాగా, పరిహారం పంపిణీ దగ్గరకొచ్చేసరికి ఆ విస్తీర్ణం 9,19,391 ఎకరాలకు తగ్గిపోయింది. పంటలు దెబ్బతిన్న విస్తీర్ణంలో 3,02,509 ఎకరాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పడలేదు. రైతులు బ్యాంకులను సంప్రదించగా పరిహారం పడలేదంటున్నారు. వ్యవసాయశాఖ వారేమో పేర్లు రాసి పంపాం, పై నుండి రాలేదని చెబుతున్నారు. దాదాపు రూ.వంద కోట్లు రైతులకు రావాల్సి ఉంది. పరిహారం దక్కని వారిలో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు.

Related Posts