గుంటూరు, ఫిబ్రవరి 26,
సంక్రాంతిలోపు టిడ్కో ఇళ్లు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీలైతే డిసెంబరులోనే అప్పగిస్తాం. ఇందుకనుగుణంగా సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.' ఇదీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ 2021 నవంబర్‌లో చెప్పిన మాటలు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఊదరగొట్టారు. టిడ్కో ఇళ్లపై హామీల ఉల్లంఘనలు వైసిపి సర్కారుకు కొత్త కాకపోయినా, నవంబర్‌లో చేసిన హడావుడితో ఈసారైనా ఇచ్చేస్తారని లబ్ధిదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎప్పటి మాదిరిగానే అడియాశలయ్యాయి. పెరిగిన ఇంటి అద్దెలు భరించలేక లబ్ధిదారులు ఆశా, నిరాశల మధ్య ఉన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.65 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం గత టిడిపి ప్రభుత్వం చేపట్టింది. లబ్ధిదారుని వాటా కూడా వసూలు చేసింది. 2019 ఎన్నికలకు ఏడాది ముందు ఇళ్ల మంజూరు పత్రాలు హడావిడిగా పంపిణీ చేసింది. తాము అధికారంలోకి వస్తే ఇళ్లను అప్పగిస్తామంటూ చెప్పింది తప్ప, ఇళ్లను అప్పగించలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం 300 ఎస్‌ఎఫ్‌టిగల ఇళ్లను ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పింది. 365 ఎస్‌ఎఫ్‌టి ఇంటిని రూ.3.40 లక్షలకు, 430 ఎస్‌ఎఫ్‌టి ఇంటిని రూ.4.15 లక్షలకు కేటాయించనున్నట్టు చెప్పడంతో లబ్ధిదారులు ఎంతో సంబరపడ్డారు. అప్పట్లో టిడిపి ఇచ్చిన గృహ మంజూరు పత్రాలను రద్దు చేసి, కొత్తగా ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫొటోలతో పత్రాలను ప్రభుత్వం ఇచ్చింది. సీలింగ్, ఎలక్ట్రికల్, అలమరా కప్‌బోర్డ్, పంబ్లింగ్ వంటి ఇంటర్నల్ వర్క్స్, విద్యుత్తు, తాగునీరు, రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ తదితర మౌలిక సదుపాయాలతో పాటు అవకాశమున్న ప్రతిచోటా ప్లేగ్రౌండ్, ఓపెన్ జిమ్, గ్రీనరీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు పెండింగ్ నిర్మాణాలు చేపట్టేందుకు పిలిచిన రివర్స్ టెండరింగ్‌లో రూ.3,800 కోట్ల మేర ఆదా అయిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వీటన్నింటినీ 2021 డిసెంబర్‌లోపు పూర్తి చేసి, సంక్రాంతి నాటికి రెండు లేదా మూడు దశల్లో ఇళ్లను అప్పగిస్తామని ప్రకటించింది. కానీ, ఆచరణలో మాట నిలబెట్టుకోలేదు. సంక్రాంతి వెళ్లి నెల రోజులు దాటినా రాష్ట్రంలో ఎక్కడా పంపిణీ కాలేదు. ఇటీవల విజయనగరం జిల్లా సాలూరులో పర్యటించిన మంత్రి బత్స సత్యనారాయణ జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని కొత్తపల్లవి అందుకోవడం లబ్ధిదారుల్లో చర్చనీయాంశగా మారింది. దీనిపై సమాధానం చెప్పాల్సిన ప్రతిసారీ... టిడిపి అరకొర సదుపాయాలతో ఇళ్లు నిర్మించిం దని, తాము ఇంటర్నల్ వర్క్సుతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అందుకే ఆలస్యం అవుతోందని ప్రభుత్వం చెప్తుకొస్తోంది. వైసిపి అధికారంలోకి వచ్చి మరో రెండు నెలల్లో మూడేళ్లు కావస్తున్నా అనేక వాయిదాలతో దాటవేస్తూ వస్తోందే తప్ప, పూర్తయిన ఇళ్లను అప్పగించడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపాజిట్ల కోసం చేసిన అప్పులకు వడ్డీలు భారంగా మారుతున్నాయని వాపోతున్నారు. ఇళ్లను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.టిడ్కో ఇంటి కోసం టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.25 వేలు డిడి రూపంలో చెల్లించాను. ఇంటి మంజూరు పత్రం ఇచ్చారు. కానీ, ఇల్లు అప్పగించలేదు. వైసిపి ప్రభుత్వం కూడా రూ.25 వేలు డిడి రూపంలో వసూలు చేసింది. చంద్రబాబు బమ్మతో ఇంటి మంజూరు పత్రాన్ని ఇచ్చినట్టే జగన్మోహన్‌రెడ్డి బమ్మతో మరో పత్రాన్ని ఇచ్చారు. ఇదిగో అదుగో అంటున్నారు తప్ప, ఇప్పటికీ ఇల్లు అప్పగించలేదు. గతంలో సంక్రాంతికి అప్పగిస్తామన్నారు. ప్రస్తుతం జూన్‌లో ఇస్తామంటూ మాట మార్చారు. ఈ ప్రభుత్వం ఇలాంటివి వాయిదాలు చాలా వేసిందన్నారు