YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వాస్పత్రిలో తాగునీటి ఇక్కట్లు

ప్రభుత్వాస్పత్రిలో తాగునీటి ఇక్కట్లు

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో తాగునీటికి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రోగుల బంధువులు తాగునీటి కోసం అల్లాడిపోతున్న దుస్థితి. ఆసుపత్రిలో ఎన్నో సౌకర్యాలు కల్పించామని చెప్పుకునే అధికారులు ఇక్కడికి వచ్చేవారి దాహం తీర్చలేకపోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాసుపత్రికి రోజుకు ఔట్‌ పేషంట్లు 3 వేల మంది వరకూ వస్తుంటారు. వీరికి తోడుగా బంధువులు వస్తుంటారు. ఇక ఇన్‌పేషెంట్లు సరేసరి. హాస్పిటల్ లో మంచి నీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో ఉద్యోగులు, వైద్యులు ఇంటి నుంచే బాటిల్స్‌లో తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇక దిగువ స్థాయి సిబ్బందికి, రోగులకు, సహాయకులకు తాగునీటి కోసం నానాపాట్లు పడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. ఆస్పత్రిలో సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేక పలువురు అల్లాడిపోతున్నారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ఉన్నా అవి వాడకానికి ఉపయోగిస్తున్నారు. సురక్షితమైన తాగునీరు నామమాత్రంగా రెండు ప్రదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అవి కూడా అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. దీంతో అక్కడ నీరు పట్టుకోవాంటేనే అంతా వెనకడుగేస్తున్నారు. ఈ నీరు తాగితే లేనిపోని రోగాలు వస్తాయేమోనని భయపడుతున్నారు. 

 

మూడున్నరేళ్ల కిందట నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు నిధులతో సురక్షితమైన తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. అయితే అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. మొత్తంగా ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ఎవరికివారు తాగునీటిని కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి కావటంతో ఆసుపత్రికి వస్తున్నవారు అల్లాడిపోతున్నారు. తెచ్చుకున్న బాటిళ్లలో నీరు అయిపోవడంతో బయట కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో స్థానికంగా నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. రోజుకు రూ.30 నుంచి 40 వరకు కేవలం తాగునీటికి వెచ్చించాల్సి వస్తుంది. ఇన్‌పేషెంట్లకు ఈ భారం నెలకు రూ.వెయ్యి వరకూ ఉంటోంది. కోస్తా ప్రాంతానికే తలమానికంగా ఉన్న ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో తాగునీరు అందించే పరిస్థితి లేకపోవడంపై సర్వత్రా ఆవేదన వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికార యంత్రాంగం స్పందించి తక్షణమే తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.  

Related Posts