అమరావతి
మహా శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపడానికి సిద్దమయింది. రాష్ట్రంలోని 96 శైవక్షేత్రాలకు వేర్వేరు ప్రాంతాలకు 3225 ప్రత్యేక సర్వీసులను నడుపనుంది. మార్చి 1న మహా శివరాత్రి పర్వదినం రోజున 21లక్షల మంది భక్తులు వస్తారని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు.ఈ సారి అదనపు రుసుము లేకుండానే ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. అవసరమైతే అదనపు బస్సులు నడిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా కోటప్పకొండకు 410 బస్సులు, కర్నూలు జిల్లా శ్రీశైలానికి 390 బస్సులు ఏర్పాటు చేసారు. కడప జిల్లా పోలతల, నిత్యపూజ కోన, పశ్చిమ గోదావరి జిల్లా బలివె, పట్టిసీమ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతారు.
కోటప్పకొండ, శ్రీశైలం, పొలతల తదితర శైవ క్షేత్రాలకు ఘాట్ రోడ్డు ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఘాట్ రోడ్డులో నడిపే బస్సులను పూర్తిగా తనిఖీ చేసి నడపనున్నారు. ఇందుకోసం ఘాట్ రోడ్డు డ్రైవింగ్లో అనుభవమున్న డ్రైవర్లను ఏర్పాటు చేస్తున్నారు.
పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని బస్సులు ఎక్కే ప్రాంతాల్లో తాగునీరు, షామియానాలు, విచారణ కేంద్రాలతో పాటు అవసరమైన చోట్ల తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కోటప్ప కొండకు ఏకాదశి పర్వదినం రోజున భక్తుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు నడిపే బస్సుల్లో కోవిడ్ నిబంధనల మేరకు పూర్తిగా శానిటైజ్ చేసి నడుపుతారు. ముఖ్య కూడళ్లు, మలుపుల వద్ద సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్లను ఏర్పాటు చేసి భక్తుల భద్రతతో కూడిన ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక బస్ స్టేషన్లు సహా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ద్యం సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.