హైదరాబాద్, ఫిబ్రవరి 26,
జూపల్లి రామేశ్వరరావు. మైహోం గ్రూప్ ఛైర్మన్. చినజీయర్ స్వామికి ప్రియాతిప్రియమైన శిష్యుడు. చాలామందికి చాలా చాలా సన్నిహితుడు. వేల కోట్ల అధిపతి. సిమెంట్ వ్యాపారంలో కింగ్ పిన్. రియల్ ఎస్టేట్ రారాజు. ఆయన లైఫ్‌లో మెరుపులతో పాటు మరకలూ ఉన్నాయి. ముచ్చింతల్‌లో.. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీతో.. దేశవ్యాప్తంగా ఆకర్షణతో పాటు రాజకీయ అలజడికీ కారణమయ్యారు. సమతామూర్తి విగ్రహం ఏ ముహూర్తాన ఆవిష్కరించారో కానీ.. అప్పటి నుంచీ అనేక వివాదాలు.. జగడాలు.. రాజకీయాలు. ఈక్వాలిటీ ప్రోగ్రామ్‌లో ఈక్వాలిటీ లేదంటూ.. రామానుజుల సాక్షిగా మోదీపై ఎర్రజెండా ఎగరేశారు కేసీఆర్. మోదీ అనే కాదు.. చినజీయర్, రామేశ్వర్‌రావులపైనా కన్నెర్ర జేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి కర్త, కర్మ, క్రియలు చినజీయర్ అండ్ రామేశ్వర్‌రావులే. వారికి సీఎం కేసీఆర్ ఫుల్‌గా కోఆపరేట్ చేశారు. అలా ఏళ్లుగా ఒక్కో రాయి పేర్చుతూ వచ్చి.. ఇప్పటికిలా పంచలోహ మూర్తి ఆవిష్కృతమయ్యారు. అంతా కలిసి ఇంతా చేస్తే.. లాస్ట్ మినిట్‌లో వరుస విజిట్స్‌తో.. మోదీ అండ్ టీమ్.. ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసేసుకుంది. గుజరాత్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనతంగా మోదీకి దక్కినట్టుగానే... హైదరాబాద్‌లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీతో తన పేరూ దేశవ్యాప్తంగా మారుమోగుతుందని భావించారు కేసీఆర్. కానీ, ఆయన ఆశలను, ఆకాంక్షలను.. గద్ద తన్నుకు పోయినట్టు ఎత్తుకుపోయింది బీజేపీ. కమలనాథులు పక్కా వ్యూహంతో అడుగులు వేశారని అంటున్నారు. మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్, కొవింద్.. ఇలా వరుసగా కేంద్ర పెద్దలంతా తరలివచ్చి.. నేషనల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసి.. అదేదో తమ ప్రోగ్రామే అన్నట్టు సీన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ కాగలిగారు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో.. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎవరు ఏర్పాటు చేశారంటే.. మోదీనే అనే ఆన్సర్ వస్తోంది. అందుకే, అప్పుడో ప్రెస్‌మీట్లో కేసీఆర్ సైతం ఆ మేరకు బీజేపీ సోషల్ మీడియా ప్రచారంపై తెగ ఫైర్ అయ్యారు. అదంతా పక్కనపెడితే.. రామేశ్వర్‌రావు విషయానికి వస్తే...
ఎప్పుడైతే కేసీఆర్.. చినజీయర్, రామేశ్వర్‌రావుపై గుర్రుగా ఉన్నారనే విషయం బయటపడిందో.. అప్పుడిక క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది బీజేపీ. ఇప్పటికే.. చినజీయర్ తన ప్రసంగాలు, పొగడ్తలతో ఆయన బీజేపీ స్వామిగా ముద్రపడిపోయారు. ఇక, ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న మైహోం రామేశ్వర్‌రావునూ కమలనాథులు తమ హిట్ లిస్ట్‌లో చేర్చేశారని తెలుస్తోంది. ఆర్థికంగానే కాదు.. బలమైన మీడియా సైతం మైహోం చేతిలోనే ఉండటంతో రామేశ్వర్‌రావుతో అదనపు అడ్వాంటేజ్. కేసీఆర్‌తో ఎలాగూ చెడింది కాబట్టి.. రామేశ్వర్‌రావుకు బీజేపీలోకి సాదర ఆహ్వానం పలుకున్నారు కమలనాథులు. గౌరవప్రదంగా వస్తే ఓకే.. లేదంటే, ఇప్పటికే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్వయంగా సీబీఐకి, ఈడీకి పలు కంప్లైంట్స్ చేశారు. సాక్షాలు కూడా సమర్పించారు. అప్పట్లో మైహోం గ్రూప్‌పై ఐటీ రైడ్స్ కూడా జరిగాయి. దారికొస్తే సరేసరి.. లేదంటే.. తెలుసుగా బీజేపీ స్టైల్ డీలింగ్ ఎలా ఉంటుందో.. అంటూ రామేశ్వరరావును దారికి తెచ్చుకున్నారట కమలనాథులు. త్వరలోనే ఆయనకు కాషాయ కండువా కప్పేసి.. రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. పార్లమెంట్‌లో మైక్ పట్టుకొని.. ఒక్కసారైనా అధ్యక్షా.. అని అనాలనేది ఆయన డ్రీమ్ కూడానట. ఇలా, తన కార్యం.. స్వామి కార్యం రెండూ నెరవేరే ఆఫర్ రావడంతో రామేశ్వర్‌రావు సైతం భారత్‌మాతాకీ జై అనబోతున్నారని అంటున్నారు.