YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణలోనూ... అమ్యూల్యమేనా

తెలంగాణలోనూ... అమ్యూల్యమేనా

హైదరాబాద్, ఫిబ్రవరి 26,
ఎంతోమంది ఉద్యోగులు, రైతుల జీవితాలను నిలబెడుతున్న విజయడెయిరీ నిర్లక్ష్యానికి గురవుతోంది. నిర్వహణ గాడి తప్పుతోంది. చైర్మెన్‌ పదవీకాలం ముగిసినా.. ఐదు నెలలుగా పూర్తిస్థాయి మేనేజింగ్‌ డైరెక్టర్‌ లేక అభివృద్ధి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. విజయ డెయిరీ అభివృద్ధిపై ఉద్యోగులే కాకుండా పాడి రైతులు ఆధారపడి ఉన్నారు. తెలంగాణలో క్షీర విప్లవానికీ విజయ డెయిరే నాంది. కానీ అకస్మాత్తుగా అమూల్‌ డెయిరీపై ప్రేమ ఒలకబోస్తున్న పాలకులు.. విజయడెయిరీని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విజయ డెయిరీకి గతేడాది సెప్టెంబర్‌ 11 నుంచి పూర్తిస్థాయి మేనేజింగ్‌ డైరెక్టర్‌ లేరు. ఆ తర్వాత పాడి పరిశ్రమ, పశుసంవర్థక మత్యశాఖ సెక్రటరీ అనిత రాజేందర్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినా.. ఈ ఏడాది జనవరి నుంచి ఆమె ఇతర శాఖకు బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత ఆదర్‌ సిన్హా బాధ్యతలు చేపట్టినా సరిగ్గా పట్టించుకోవడం లేదని, వారానికి ఒక్కరోజు విధులకు వస్తుంటారని విమర్శలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల వల్ల డెయిరీ పాలనా విభాగంలో కీలకమైన నిర్ణయాలు, పనులు ముందుకు సాగక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. డెయిరీలో నిత్య కార్యకలాపాలు మినహా ముఖ్యమైన వ్యవహారాలు, అభివద్ధి పనులు నిలిచిపోయాయని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో డెయిరీ అభివృద్ధిలో భాగంగా మెఘా డెయిరీ భవన నిర్మాణం కోసం భూమిపూజ చేసినా పనులు ప్రారంభం కాలేదు. డెయిరీ లాభాల్లో ఉందని, పాడి పరిశ్రమ, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, డెయిరీ పరిధిలోని రైతులకు ఇన్‌సెంటీవ్స్‌ ఇస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల నుంచి పూర్తిస్థాయి ఎండీని ఎందుకు నియమించడం లేదో అర్థం కావడం లేదు.
ప్రస్తుతం ఉన్న డెయిరీ చైర్మెన్‌ లోకభూమారెడ్డి పదవీకాలం ఈనెల 17 నాటికి ముగిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తొలి చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టి రెండుసార్లు అంటే ఐదేండ్లపాటుగా పనిచేశారు. ప్రస్తుతం పదవీకాలం ముగియడంతో ఆయననే కొనసాగిస్తారా? లేక కొత్తవారిని చైర్మెన్‌గా నియమిస్తారా అన్న చర్చ నడుస్తోంది. లోకభూమారెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, స్వయంగా రైతుబిడ్డ. తెలంగాణ ఉద్యమకారుడు అయినందున ఆయనకు సీఎం కేసీఆర్‌ సాన్నిహిత్యంతో రెండుసార్లు అవకాశం దక్కింది. భూమారెడ్డి డెయిరీ చైర్మెన్‌గా అనేక సంస్కరణలు చేపట్టడమేగాక, మెగా డెయిరీ సాధించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మూడోసారి కూడా ఆయనను కొనసాగిస్తారా? కొత్త వారికి అవకాశం కల్పిస్తారా ? అన్న ఆసక్తి ఏర్పడిందిఎంతో చరిత్రాత్మక నేపథ్యం కలిగిన విజయ డెయిరీ పట్ల పాలనాపరమైన నిర్లక్ష్యం కొనసాగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ డెయిరీపై ఎందుకింత వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమైన నిర్ణయాలు, పనులు ఆగిపోవడంతో ప్రయివేటు డెయిరీల డామినేషన్‌ పెరిగి, మార్కెట్‌లో పోటీలో తట్టుకోలేని పరిస్థితి దాపురిస్తుందని, ఇంకోవైపు 'అమూల్‌' ప్రవేశం కూడా ప్రభావం చూపుతుందని ఉద్యోగులు, విజయ డెయిరీపై ఆధారపడిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని డెయిరీకి పూర్తిస్థాయి ఎండీని, చైర్మెన్‌ను నియమించాలని కోరుతున్నారు. కొందరు 'విజయ డెయిరీ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి ఉద్యమిస్తున్నారు.
డెయిరీలో వివాదాస్పద పరిణామాలకు కారణమైన మాజీ ఎండీ గురజాల శ్రీనివాసరావుపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టారని, ఉద్యోగులను వేధించారని, లావాదేవీలకు సంబంధించి రూ.5 నుంచి 8 కోట్ల వరకు ఆర్థిక అవకతకలకు కారణమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వేధింపులకు పాల్పడినట్టు ఓ మహిళా ఉద్యోగి ఫోన్‌ రికార్డులు, పలు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన సెలవులో ఉన్నరోజునే రాత్రికి రాత్రే ఆగమేఘాల మీద బదిలీ ఆర్డర్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ శ్రీనివాసరావు తన బలమైన లాబీయింగ్‌తో విచారణ నుంచి తప్పించుకుని ప్రస్తుతం సేఫ్‌జోన్‌లో ఉన్నారు. ఇప్పటికైనా ఆయనపై చర్యలు తీసుకోవాలని విజయడెయిరీకి చెందిన బాధిత ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related Posts