తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో కంపోస్ట్ యార్డ్ కొంత సమస్యాత్మకంగా మారింది. వాస్తవానికి టౌన్ లో కంపోస్టు యార్డు ఉంది. అయితే దానికి సరైన దారి లేకపోవడమే ఇబ్బందులకు తావిస్తోంది. కంపోస్ట్ యార్డ్ కు భూమిని కొనేటప్పుడు.. దీనికి సరైన మార్గం ఉందీ లేనిదీ పరిశీలించకుండా కొనుగోలు జరిగినట్లు స్థానికులు అంటున్నారు. దీంతో యార్డుకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. సామర్లకోట పట్టణానికి చెత్తను వేయడానికి కంపోస్టు యార్డు కోసం 3 ఎకరాల భూమిని కోనుగోలు చేశారు. కానీ యార్డుకు దారీ ఉందో లేదో మున్సిపల్ అధికారులు చూసుకోలేదని సమాచారం. అంతేకాక యార్డు సామర్లకోట పట్టణానికి సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంది. పూర్వం గ్రావెల్, కంకరు కోసం తవ్విన క్వారీ గోతుల్లో కంపోస్టు యార్డును కొనుగోలు చేశారు. రూ.5 లక్షల వెచ్చించి మూడెకరాల భూమిని కొన్నారు. సామర్లకోట పట్టణానికి సొంతంగా కంపోస్టు యార్డు ఉండాలనే ధ్యేయంతో అప్పటి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్‌లు ఈ యార్డు కొనుగోలులో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. సరైన దారిని ఏర్పాటు చేయకపోవడంతో చెత్త తరలింపు సమస్మాత్మకంగా మారింది.
యార్డును కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మార్గం లేకపోవడంతో పూర్తిస్థాయిలోవినియోగంలోకి రాలేదు. కంపోస్ట్ యార్డ్ పట్టణానికి 5 కిలోమీటర్లు దూరంలో ఉండడంతోమున్సిపల్ ట్రాక్టర్లు వెళ్లిరావడం కష్టంగా ఉంది. ఈ కష్టాల మధ్యే కొంతకాలం రాకపోకలు సాగించారు. అయితే ప్రయాణ చార్జీలు తట్టుకోలేక మళ్లీ విరమించారు. అదే విధంగా చెత్త ఈ ఐదు కిలోమీటర్ల మేర మార్గం మధంమలొ పడిపోవడంతో రహదారులు చెత్తమయం అవుతున్నాయి. ఇప్పటికి యార్డ్ కు చెత్తను చేరవేసేలా సమర్ధవంతమైన మార్గంపై మున్సిపల్ అధికారులు సరైన ఆలోచన చేయలేదని, చర్యలు అసలే తీసుకోలేదని స్థానికులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇదిలాఉంటే రాను రాను చెత్త ఎక్కువ కావడంతో మున్సిపాలిటీ అభివృద్ధి చెందడం వల్ల చెత్తను కంపోస్టు యార్డులలోనికి చేర్చడానికి ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో పర్మినెంటు కంపోస్టు యార్డు లేకపోవడం వల్ల చెత్తను కొంతకాలం పెద్దయేటి వద్ద, కొంతకాలం ఎడిబి రోడ్డు క్వారీ గోతుల్లో వేసేవారు. మొత్తంగా పట్టణంలో కంపోస్ట్ యార్డ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని అంతా అంటున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యపై దృష్టిసారించి మరో యార్డ్ కొనుగోలు చేయాలని అధికారులను కోరుతున్నారు. లేదంటే భవిష్యత్ లో సమస్యలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు.