విజయవాడ, ఫిబ్రవరి 28,
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా.. వద్దా! ఆంధ్రప్రదేశ్ టీడీపీకి ఇప్పుడిదో పెద్ద క్వశ్చన్ మార్క్. ఇదే ఇష్యూపై సమీక్షలు జరిపి నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కానీ ఓ నిర్ణయానికి రాలేక తర్జనభర్జనలు పడుతున్నారు. మార్చి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంది. గట్టిగా వారం కూడా టైమ్ లేదు. జనరల్‌గా అయితే ప్రతిపక్ష పార్టీ ఈ సమయంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వానికి సంధించాల్సిన ప్రశ్నలు, నిలదీయాల్సిన అంశాలపై ప్లాన్ చేసుకోవాలి. కానీ, ఏపీలో మాత్రం డిఫరెంట్ పరిస్థితి నెలకొంది. అసలు సమావేశాలకు హాజరుకావాలా వద్దా అనేదే తేల్చుకోలేక పోతోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.అయితే, తెలుగుదేశం పార్టీ తర్జనభర్జనకు ఓ కారణం ఉంది. అదే గత సంవత్సరం నవంబర్ 19న అసెంబ్లీలో జరిగిన సీన్. తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించారంటూ సమావేశాలు బాయ్‌కాట్ చేశారు ఆ పార్టీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు. మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగు పెడతానంటూ శపథం చేశారు. మరి అధినేత లేకుండానే సమావేశాలకు వెళ్లాలా.. లేక అందరూ గైర్హాజరు కావాలా అనే అంశంపై ఓ క్లారిటీకి రాలేకపోతోంది తెలుగుదేశం.ఈ విషయంపై ముఖ్య నేతలతో ఇప్పటికే చర్చించారు చంద్రబాబు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కొందరు అసెంబ్లీకి హాజరు కావాలని.. మరికొందరు వద్దని చెప్పారట. చంద్రబాబు వస్తే మరింత హేళన చేస్తారని.. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరని.. అందుకే దూరంగా ఉండటమే బెటర్ అని కొందరు అభిప్రాయపడ్డారట. రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలు ఉన్నాయని.. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ వేదికగా వాటిని ప్రస్తావించాలన్నది ఇంకొందరి వెర్షన్. మొత్తానికి సమావేశాల షెడ్యూల్ వచ్చిన తర్వాత టీడీఎల్పీ భేటీ నిర్వహించి ఫైనల్‌గా ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.ఇదిలాఉంచితే.. వైసీపీ నుంచి అప్పుడే కౌంటర్లు మొదలయ్యాయి. సీఎం అయ్యాకే మళ్ళీ సభలో అడుగుపెడతానంటూ జయలలిత స్టైల్‌లో శపథాలు చేసిన చంద్రబాబు.. మళ్లీ వెళ్లాలా, వద్దా అంటూ సమీక్షలు చేయడం ఏంటని ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అయినా చంద్రబాబుకి ఇక ఆ అవసరం రాకపోవచ్చని.. జనమే ఆయన్ను బహిష్కరిస్తారంటూ ట్వీట్ చేశారు.