విజయవాడ, ఫిబ్రవరి 28,
జనసేనలో చేరికలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను జనసేనలో చేర్చుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ చేరికలను స్వయంగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు. జనసేనలో చేరికలు లేక చాలా కాలమయింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో చేరికలు ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. చేరికలకు గ్రీన్ సిగ్నల్... అయితే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎవరంటే వారు వచ్చి చేరకుండా ప్రజల్లో పట్టున్న, నిజాయితీ కలిగిన నేతలను పార్టీలో చేర్చుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించడంతో నాదెండ్ల మనోహర్ జిల్లాల వారీగా చేరికల జాబితాను తయారు చేస్తున్నారు. మార్చి లో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా ఈ సభలో చేరికలకు కొంత సమయం ఇవ్వాలని జనసేనాని భావిస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి నేతలయినా సరే చేర్చుకోవాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు.జనం గుండెల్లో హీరో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.... ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వైసీపీ, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు జనసేనలో చేరేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వారిలో కొందరు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ను ఆశించే వారు కూడా ఉన్నారు. వీరి బ్యాక్ గ్రౌండ్, ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే జనసేన హైకమాండ్ ఆరా తీసినట్లు తెలిసింది. సదరు నేతకు ప్రజల్లో ఉన్న పలుకుబడితో పాటు, ఆయనకు ప్రజా సమస్యలపై ఉన్న అవగాహనను కూడా చేరికలలో ప్రాధాన్యతగా తీసుకోనున్నారు.ఈసారి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముందని చెబుతున్నారు. పొత్తు విషయంలో పవన్ ఈ సభలోనే ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే మార్చిలో జరిగే ఈ సభకు రాజకీయంగా ప్రాధాన్యత ఉందని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. చేరికలతో పాటు బిగ్ అనౌన్స్ మెంట్ కూడా ఉంటుందన్న ప్రచారం తో జనసేన ఆవిర్భావ సభకోసం ఆసక్తిగా అన్ని రాజకీయ పక్షాలు ఎదురు చూస్తున్నాయి.