గుంటూరు, ఫిబ్రవరి 28,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటించే ఉద్దేశ్యంలో ఉన్నట్లు కనిపిస్తుంది. 175 నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై చంద్రబాబు ఫోకస్ పెంచారు. అక్కడి నేతల పనితీరు, పార్టీ పరిస్థితిపై లోతుగా విశ్లేషిస్తున్నారు. మరోవైపు సర్వే నివేదికలను కూడా తెప్పించుకుంటున్నారు. నివేదికల ఆధారంగా ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటించి వారిని జనంలోకి పంపాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది... చివరి నిమిషం వరకూ... చంద్రబాబు ఎప్పుడూ చివరి నిమిషం వరకూ అభ్యర్థులను ప్రకటించరు. గత కొన్ని ఎన్నికల నుంచి ఆయన సంప్రదాయంగా పాటిస్తున్న పద్ధతి ఇదే. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే ఆయన అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ గత తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్బంగా పనబాక లక్ష్మిని ముందుగానే ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయినా ఫలితం కొంత అనుకూలంగానే కన్పించింది. వైసీపీ మెజారిటీని చాలా వరకూ నిలువరించగలిగారు. గుండెల్లో హీరో కొన్ని కీలక నియోజకవర్గాల్లో..... ఇదే సూత్రాన్ని సాధారణ ఎన్నికల్లోనూ చంద్రబాబు పాటించాలని డిసైడ్ అయినట్లే కనిపిస్తుంది. అందుకే నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వస్తున్నారు. జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి, సామాజిక కోణంలో కూడా ఈసారి ఎంపిక ఉంటుందని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కీలక నియోజకవర్గాలపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. . దీంతో పాటు ఈసారి పొత్తులతో చంద్రబాబు బరిలోకి దిగుతున్నారు. అందుకోసం కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండదు. టీడీపీ బలంగా ఉన్న యాభై నుంచి డెబ్భయి నియోజకవర్గాల్లోనే చంద్రబాబు ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. అభ్యర్థులను ఏడాది ముందుగానే ప్రకటిస్తే వారు ప్రచారాన్ని కూడా ముందుగానే ప్రారంభించి ప్రభుత్వ, స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకతను ప్రజలకు వివరించే వీలుంది. మొత్తం మీద చంద్రబాబు ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతో పార్టీ నేతల్లో టెన్షన్ ప్రారంభమయింది. మే నెలలో మహానాడు పూర్తయిన వెంటనే చంద్రబాబు రాజకీయంగా మరింత స్పీడ్ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.