YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్‌ భారీ విగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ఎన్టీఆర్‌ భారీ విగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

విజయవాడ, ఫిబ్రవరి 28,
కృష్ణా జిల్లాలో ఈ పేరు చుట్టూనే రాజకీయం జరుగుతోంది. ఎన్టీఆర్‌ను ఎవరికి వారు ఓన్‌ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ఏర్పడే విజయవాడ జిల్లాకు ఎన్జీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఈ ప్రక్రియ నడుస్తుండగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్‌. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్‌ భారీ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ప్రభుత్వ పెద్దలను కలిసి ఎన్టీఆర్‌ భారీ విగ్రహం పెట్టాలన్న తన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయించుకున్నారు. పనులు కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఆలోచన ఉందట. ఎన్టీఆర్  విగ్రహం పెట్టాలన్న వైసీపీ నిర్ణయం కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని కానీ.. అలాగే ఆయన స్వగ్రామంలో భారీ ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టాలన్న ఆలోచన కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి రాలేదు. కానీ ఆ పనిని వైసీపీ చేసి చూపిస్తోందనే చర్చ జరుగుతోంది. టీడీపీ విస్మరించిన ఎన్టీఆర్‌కు వైసీపీ ప్రాధాన్యం ఇస్తోందన్న అభిప్రాయం జనంలోకి వెళ్లడమే దాని లక్ష్యం. ఎన్టీఆర్‌ స్వగ్రామానికి నారా-నందమూరి కుటుంబ సభ్యులు వచ్చారు.. వెళ్లారు. నిమ్మకూరును నారా లోకేష్‌ దత్తత తీసుకున్నారు. కానీ తాత స్థాయికి తగ్గట్టుగా ఆయన స్వగ్రామంలో ఎన్టీఆర్‌ భారీ విగ్రహం పెట్టాలన్న కనీస ఆలోచన చేయలేక పోయారనేది చర్చ. బాలయ్య కూడా వివిధ సందర్భాల్లో నిమ్మకూరును సందర్శించి.. తాను అక్కడ తిరిగాను.. ఇక్కడ ఆడుకున్నానని చెప్పుకున్నారే తప్ప.. ఎన్టీఆర్‌ కీర్తిని మరింత ఇనుమడింప చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదనే చర్చ స్థానికంగా జరుగుతోందట. ఎన్టీఆర్ ఆయన సతీమణి బసవ తారకం చిన్న విగ్రహాలు నిమ్మకూరులోఉన్నాయి. అన్నిచోట్ల ఉన్నట్టే ఆ విగ్రహాలు ఉన్నాయి కానీ ఎన్టీఆర్ స్వగ్రామం అన్న స్థాయిలో లేవు. దాన్నే వైసీపీ పట్టుకుంది. విశ్వవిఖ్యాత పద్మశ్రీ డాక్టర్‌ నందమూరి తారక రాముడి స్థాయి.. ఆ లెవల్లో భారీ విగ్రహం రాబోతుంది అక్కడ. ఇదే సమయంలో మరో చర్చ జరుగుతోంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని రెండు బలమైన.. కీలక సామాజికవర్గాలకు చెందిన వారిని ప్రసన్నం చేసుకునేలా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Posts