YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టికెట్.. టికెట్...

టికెట్.. టికెట్...

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఈసారీ అదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సీటును బీసీలకు కేటాయించే సంప్రదాయం టీడీపీలో కొనసాగుతోంది. అదే కోణంలో రేణుకను ఈసారి నిలపనున్నారు. ఆమె ఎమ్మిగనూరు నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని ఆసక్తిగా ఉన్నా... కర్నూలు ఎంపీగా పోటీచేయించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసేదీ ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రె్‌సలో ఉన్న మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డిని వైసీపీలోకి తీసుకువచ్చి పోటీ చేయించాలనేది ఆ పార్టీ ప్రయత్నం. కానీ, ఆ ప్రయత్నాలకు సూర్యప్రకాశ్‌ రెడ్డి ఇప్పటిదాకా స్పందించలేదు. నిజానికి... ఆయన వస్తే తీసుకోవడానికి టీడీపీ కూడా ఆసక్తిగా ఉంది. కానీ, ఆయన ప్రస్తుతానికి కాంగ్రె్‌సను వీడే యోచనలో లేరు. వైసీపీ నుంచి డీవై రామయ్య, డాక్టర్‌ సంజీవ్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

 

నంద్యాల సిటింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య కారణాలతో ఈసారి పోటీచేసే పరిస్థితిలో లేరు. ఆ స్థానంలో టీడీపీ తరఫున టికెట్‌ రేసులో మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, పార్టీ నేత మాండ్ర శివానందరెడ్డి ముందున్నారు. వైసీపీలో కీలక నేత గౌరు వెంకటరెడ్డికి శివానందరెడ్డి స్వయానా బావ. శివానందరెడ్డికి నంద్యాల టికెట్‌ ఇస్తే... గౌరు దంపతులు టీడీపీలో చేరతారా, వైసీపీలోనే కొనసాగుతారా అనేది సస్పెన్స్‌. ఒకవేళ గౌరు దంపతులు టీడీపీలోకి వస్తే పాణ్యం అసెంబ్లీ టికెట్‌ వారికే దక్కుతుంది. మరోవైపు... గంగుల ప్రతాపరెడ్డి సోదరుడు ప్రభాకర రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుమారుడు ఆళ్లగడ్డలో వైసీపీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గంగుల ప్రతాపరెడ్డికి టీడీపీ ఎంపీ టికెట్‌ ఇస్తే ప్రభాకరరెడ్డి ఎటువైపు ఉంటారన్నది మరో కోణం! వీరు కాక ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల, అల్లుడు శ్రీధర్‌ రెడ్డి తమలో ఒకరికి ఏదో ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నంద్యాల ఎంపీ సీటుకు వైసీపీ తరఫున ఎవరు పోటీచేస్తారన్నది కూడా ఇంకా తేలలేదు. ప్రస్తుతం శిల్పా కుటుంబం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి శిల్పా మోహనరెడ్డి, ఆయన కుమారుడు రవిచంద్ర కిశోర్‌ రెడ్డిల్లో ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకొంటున్నారని అంటున్నారు. ఆ కుటుంబానికి వైసీపీ నాయకత్వం రెండు సీట్లు ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇక్కడి వాళ్లు అక్కడ... అక్కడి వాళ్లు ఇక్కడ! ఇప్పుడు ఇక్కడున్న వాళ్లు రేపు ఎక్కడెక్కడో! కర్నూలు బరిలో ‘అభ్యర్థి’ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోటగా నిలిచింది. అయితే... ఆ పార్టీ నుంచి గెలిచిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఇంకా కొన్ని మార్పుచేర్పులకు అటూ ఇటూ అవకాశం ఉండటం ఈ జిల్లా రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. వైసీపీ ఆధిక్యాన్ని దెబ్బతీయాలని టీడీపీ... తన ఆధిక్యాన్ని నిలుపుకోవాలని వైసీపీ అనుసరిస్తున్న వ్యూహ ప్రతివ్యూహాలు, గట్టి అభ్యర్థుల కోసం అన్వేషణ... ఇవన్నీ జిల్లాలో రాజకీయ వాతావరణాన్ని ‘నువ్వా నేనా’ అన్నట్లుగా తయారు చేస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో ఈ జిల్లాలోని రెండు ఎంపీ సీట్లను, పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లలో ఏకంగా 11 వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. కానీ... ఆ తర్వాతి పరిణామాల్లో... ఇద్దరు ఎంపీలూ టీడీపీ గూటికి చేరారు. అలాగే ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు కూడా ‘సైకిల్‌’ ఎక్కారు. దీంతో... జిల్లా రాజకీయాలపై టీడీపీ ఆధిక్యం సాధించింది. అదే సమయంలో నాయకుల సంఖ్య పెరిగి టికెట్లకు పోటీ కూడా తీవ్రమైంది.

 

పాణ్యం అసెంబ్లీ సీటు వ్యవహారం రెండు ప్రధాన పార్టీల్లో ఆసక్తిగా మారింది. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పోటీ చేశారు. ఈసారి కూడా ఆయనే టికెట్‌ ఆశిస్తున్నారు. అలాగే... బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన చేరితే అక్కడి టికెట్‌కు బలమైన పోటీదారు అవుతారు. గౌరు దంపతుల రాజకీయ వైఖరి ఎలా ఉంటుందన్న దానిపై పలు ప్రచారాలు నడుస్తున్నాయి. తాము వైసీపీ తరఫునే పోటీ చేస్తామని గౌరు దంపతులు ప్రకటనలు చేస్తున్నారు. కానీ, ఇటీవల మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి బీజేపీ నుంచి వైసీపీలో చేరడంతో వైసీపీలో టికెట్‌ పోటీ బాగా పెరిగిపోయింది. గౌరు దంపతులపై అనుమానంతోనే కాటసానిని వైసీపీలోకి తీసుకొన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉప ఎన్నికలో టీడీపీ భారీ మెజారిటీతో గెలిచిన నంద్యాలలో ఆ పార్టీ టికెట్‌ కోసం పోటీ పెరిగింది. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఉండగా... తమకూ టికెట్‌ కావాలని ఏవీ సుబ్బారెడ్డి, శాసనమండలి చైర్మన్‌ ఫరూక్‌ తనయుడు ఫిరోజ్‌, ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌ రెడ్డి కోరుతున్నారు. వైసీపీలో మాత్రం పెద్దగా పోటీలేదు. శిల్పా మోహనరెడ్డి కుటుంబంలో ఒకరు బరిలో నిలిచే అవకాశముంది.

 

కర్నూలు సిటింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డికి పోటీదారుగా... టీడీపీ నుంచి టీజీ వెంకటేశ్‌ తనయుడు భరత్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. వైసీపీలోనూ ఇదే పరిస్థితి ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ ఖాన్‌, పార్టీ నేత తెర్నేకట్లు సురేందర్‌రెడ్డి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికైతే... టీడీపీ నుంచి ఎస్వీ, వైసీపీ తరఫున హఫీజ్‌ఖాన్‌కు అవకాశం రావొచ్చునని చెబుతున్నారు. కోడుమూరులో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే మణి గాంధీకి నియోజకవర్గ టీడీపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డితో పడటం లేదు. మరొకరికి టికెట్‌ ఇవ్వాలని విష్ణువర్ధన్‌రెడ్డి కోరుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని ఆకెపోగు ప్రభాకర్‌ అనే నేత టికెట్‌ ప్రయత్నాల్లో దిగారు. వైసీపీ తరఫున నియోజకవర్గ సమన్వయకర్త మురళీ కృష్ణ ఉన్నారు. ఆయన అంత చురుగ్గా లేకపోవడంతో మరొకరిని దింపుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కోట్ల వర్గానికి కొంత బలం ఉంది. ఆ వర్గం ఏ వైఖరి తీసుకొంటుందన్నదానిపై అభ్యర్థి ఎంపిక ఆధారపడి ఉండవచ్చని అంటున్నారు.

 

ఉప ముఖ్యమంత్రి, రాజకీయ కురు వృద్ధుడు కేఈ రిటైర్మెంట్‌ తీసుకోనున్నారు. ఆయన బదులు కుమారుడు శ్యాంబాబు పత్తికొండ నుంచి పోటీచేయనున్నారు. ఈ నియోజకవర్గంలో దివంగత నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి తమ అభ్యర్థి అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ బహిరంగంగా ప్రకటించారు. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి టీడీపీ తరఫున మరోసారి పోటీ చేయడం ఖాయమైంది. ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డలో జోక్యం చేసుకోవద్దని సూచించడం ద్వారా పార్టీ అధిష్ఠానం అఖిలప్రియకే మళ్లీ టికెట్‌ ఇస్తామనే సంకేతాలు పంపింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తరఫున గంగుల విజేందర్‌ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అనుకోని పరిణామాలు ఏవైనా జరిగితే వైసీపీ నుంచి మరో కొత్త అభ్యర్ధి రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు.

 

డోన్‌, శ్రీశైలం నియోజకవర్గాల్లో పాత ప్రత్యర్థులే పోటీ పడే సూచనలు ఉన్నాయి. డోన్‌లో సిటింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో ఆయనపై పోటీపడిన కేఈ ప్రతా్‌పకు టీడీపీ మళ్లీ టికెట్టు ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి ఇటీవల టీడీపీలో చేరడం ఆ పార్టీ శిబిరాన్ని ఉత్సాహపర్చింది. శ్రీశైలంలో పోయిన ఎన్నికలతో పోలిస్తే పాత్రలు తారుమారయ్యాయి. అప్పుడు వైసీపీ తరఫున పోటీచేసి గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి ఈసారి టీడీపీ తరఫున బరిలో నిలవనున్నారు. అప్పుడు టీడీపీ తరఫున పోటీచేసిన శిల్పా చక్రపాణి రెడ్డి ఈసారి వైసీపీ అభ్యర్థి కానున్నారు. అయితే... శిల్పా చేరికదాకా వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించిన బుడ్డా శేషారెడ్డి ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఏ వైఖరి తీసుకొంటారన్నది కీలకం కానుంది.

 

బనగానపల్లి నియోజకవర్గంలో కూడా పాత ప్రత్యర్థులే పోటీ చేసే సూచనలు ఉన్నాయి. సిటింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన రెడ్డి మళ్లీ పోటీ చేయడం ఖాయంగానే ఉంది. ఆయనపై పోయినసారి వైసీపీ తరఫున కాటసాని రామిరెడ్డి పోటీ చేశారు. ఈసారి కూడా తానే పోటీ చేయాలని ఆయన అనుకొంటున్నారు. కానీ, ఆయన అల్లుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఇటీవల నంద్యాలలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో రామిరెడ్డి పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. నందికొట్కూరు రిజర్వుడు నియోజకవర్గంపై బైరెడ్డి, గౌరు వర్గాల ఆధిపత్యం కొనసాగుతోంది. పోయిన ఎన్నికల్లో వైసీపీ తరఫున ఐజయ్య విజయం సాధించారు. ఈసారి ఆయనతోపాటు ఆయన కుమారుడు చంద్రమౌళి, గౌరు యువసేన అధ్యక్షుడు వినీల్‌ కుమార్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీలో శివానందరెడ్డి వర్గం ఆధిక్యం అధికంగా ఉంది. ఆయన బండి జయరాజు పేరును ప్రతిపాదిస్తున్నారు. పోయినసారి పోటీ చేసిన లబ్బి వెంకటస్వామి మరోసారి పోటీ చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలోకి వస్తే ఇక్కడ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మరో మలుపు తిరగొచ్చు.

 

ఎమ్మిగనూరులో సిటింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి మరోసారి పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎంపీ బుట్టా రేణుక ఇక్కడ నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నా ఆమెను ఎంపీగానే నిలుపుతారని అంటున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన రెడ్డి, రుద్రగౌడ్‌ ఆశిస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో సిటింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి మరోసారి పోటీ చేయడం ఖాయమేనని అంటున్నారు. ఆయన తనయుడు ప్రదీప్‌ రెడ్డికి కూడా ఆసక్తి ఉన్నా ఈసారి బాల నాగిరెడ్డినే నిలిపే అవకాశం ఉంది. టీడీపీ తరఫున పోయినసారి పోటీచేసిన తిక్కారెడ్డి మళ్లీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తమ సామాజిక వర్గం అధికంగా ఉండటంతో తనకు అవకాశం ఇవ్వాలని వాల్మీకి ఫెడరేషన్‌ అధ్యక్షుడు బీటీ నాయుడు కోరుతున్నారు.

 

ఆదోనిలో సిటింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి, టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మళ్లీ పోటీ చేయడం ఖాయంగా చెబుతున్నారు. ఆలూరులో సిటింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు టికెట్‌ ఖాయంగా కనిపిస్తున్నా... కోట్ల కుటుంబం ఆ పార్టీలో చేరితే టికెట్‌ కోట్ల సుజాతమ్మకు దక్కే అవకాశం ఉంది. ఆ కుటుంబం టీడీపీ వైపు మొగ్గు చూపినా టికెట్‌ ఆమెకే వస్తుందంటున్నారు. పోయినసారి టీడీపీ నుంచి పోటీ చేసిన వీరభద్ర గౌడ్‌ నియోజకవర్గంలో చురుగ్గా ఉండగా ఆయనకు పోటీగా వైకుంఠం మల్లికార్జున్‌ టికెట్టు ఆశిస్తున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి కూడా ఆశిస్తున్నారు.

Related Posts