విశాఖపట్టణం, ఫిబ్రవరి 28,
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఎంపీలు చాలా పవర్‌ఫుల్. పాలిటిక్స్ అన్నీ వాళ్ల కేంద్రంగానే నడిచిన చరిత్ర ఉంది. ఎర్రన్నాయుడు, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, పురంధేశ్వరి, సుబ్బరామిరెడ్డి, కంభంపాటి హరిబాబు వంటి వారు చక్రం తిప్పారు. ప్రజా సమస్యలపై గళం విప్పడంలోనూ… అభివృద్ధి కోసం లాబీయింగ్ చేయడంలోనూ తమదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడున్న ఎంపీలు వాళ్లలా క్రియాశీలకంగా లేరనే టాక్ ఉంది. వీరికి జనంతో పెద్దగా సత్సంబంధాలు కనిపించవు. మీ ఎంపీ ఎవరని అడిగితే స్థానికులు ఠక్కున వారి పేరు చెప్పడం కష్టమే. ఎంపీల వృత్తులు, వారి బ్యాక్‌గ్రౌండ్ వల్ల రియల్‌టైమ్ పొలిటిషియన్లగా మారలేకపోయారనే విమర్శ ఉంది. దీంతో సొంత పార్టీలోనే ఎంపీలను ఖాతరు చేయడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వేగా పిలుచుకునే విశాఖజిల్లాలో ఉన్న ముగ్గురు ఎంపీలు జూనియర్లు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ మాధవి అయితే పూర్తిగా రాజకీయాలకు కొత్త. అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి.. చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నా పదవి లభించడం ఇదే తొలిసారి. రాజకీయం ఎదిగేందుకు.. ఈ ప్రాంత అభివృద్ధిపై తమదైన మార్క్ చూపించేందుకు ఈ ముగ్గురికీ అవకాశం ఉంది. కానీ, ఎంపీలు మాత్రం అందుకు భిన్నంగా వెళ్తున్నారట. కాలుదువ్వి కొట్లాడాల్సిన చోట.. వీరంతా వన్‌టైం పొలిటిషియన్లుగా మిగిలిపోయారనే చర్చ సొంత పార్టీలోనే ఉంది.ఒక్కో ఎంపీ.. దాదాపు 15లక్షల మంది ప్రజలకు ప్రతినిధి. కేంద్రం నుంచి నియోజకవర్గానికి నిధులు రాబట్టే నాయకులు. కానీ విశాఖజిల్లా ఎంపీలకు పదవి అలంకారమనే విమర్శ బలంగా వినిపిస్తోంది. పదవుల్లో ఉన్నారంటే ఉన్నారనే అభిప్రాయమే ప్రజల్లో వ్యక్తమవుతోంది. అలాగని ఎంపీలుగా వీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు.. చేయాల్సిన పోరాటాలు లేవా అంటే చాంతాండంత ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైనది రైల్వేజోన్. విభజన హామీ కింద జోన్ ప్రకటించిన కేంద్రం.. నిధుల విడుదలలో ఎంగిలి చేతితో కాకిని కొట్టినంత చొరవ కూడా తీసుకోవడం లేదు. ESI ఆస్పత్రి నిర్మాణంలో చొరవ లేదు. విశాఖకు గుర్తింపు రావడంలో కీలకమైనది స్టీల్ ప్లాంట్. 5 లక్షల మంది జీవితాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తుంది. ఇప్పుడీ పరిశ్రమపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. స్ధానిక ఎంపీలుగా వీరంతా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడమో.. మంత్రులను కలిశామని చెప్పడానికో పరిమితం అవుతున్నారే తప్ప గట్టిగా పట్టుబట్టి వాదించడం లేదనే విమర్శ ఉంది.ఇక రాజకీయంగా ఎమ్మెల్యేలతోనూ వీరికి సయోధ్య కుదరడం లేదు. సొంతపార్టీ ఎమ్మెల్యేలతోనే గ్రూప్ పాలిటిక్స్ నడిపేందుకు ఎంపీలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన దాఖలాలు ఉన్నాయి. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సినిమా, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బిజీ. నొప్పించక తానొవ్వక అనేలా ఉండే ఎంవీవీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నారట. కారణాలు ఏవైనా రియల్టర్‌గా వచ్చిన గుర్తింపు ఎంపీగా లభించలేదనే మథనం ఆయనలో ఉందట. పైగా వ్యాపారంలో ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీకో.. కొద్దిమందికో పరిమితం కావడం సరైనది కాదనే అభిప్రాయం బలంగా నాటుకున్నట్టు చెబుతారు. ఎంవీవీకి పార్టీలో ముఖ్యనాయకుడితో గ్యాప్ ఉంది.అనకాపల్లి ఎంపీ సత్యవతికి డాక్టర్‌గా పెద్ద పేరు ఉన్నా.. రాజకీయాల్లో పార్ట్ టైం అంటారు ఆ నియోజకవర్గం జనం. ఇప్పటి వరకూ రెండు మూడు సభల్లో తప్ప.. అట్టే ప్రజలకు కనిపించలేదనే టాక్ ఉంది. అనకాపల్లి మొత్తం గ్రామీణ ప్రాంతం. ఎన్నో సమస్యలు ఏళ్లతరబడి పట్టి పీడిస్తున్నాయి. వీటిపై ఎంపీ దృష్టి పెడితే కొన్నింటికైనా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆ దిశగా సత్యవతి సీరియస్‌గా చొరవ తీసుకోవడం లేదట. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ వర్గం.. సత్యవతి గ్రూప్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఆధిపత్యం కోసం కోల్డ్‌వార్ కొనసాగుతోంది.గొడ్డేటి మాధవి.. అరకు ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ రెండున్నరేళ్లలో ఆమె ఎలుగెత్తి ఏనాడూ ఏ సమస్యను చెప్పిన దాఖలాలు లేవు. పేరుకు పర్యాటక ప్రాంతమైనా గిరిజనుల అగచాట్లు అన్నీఇన్నీ కావు. పెద్ద గిరిజన ప్రాంతాలు ఉన్న ఎంపీ నియోజకవర్గం అరకు. సమస్య వస్తే.. ఎమ్మెల్యే దగ్గరకో ఐటీడీఏ దగ్గరకో పరుగుపెట్టే అడవిబిడ్డలు తమకోసం ఒక ఎంపీ ఉన్నారనే విషయం దాదాపు మరిచిపోయినట్టే కనిపిస్తోంది. ఇక్కడ గ్రూపుల గోల తక్కువేమీ లేదు. పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో ఎంపీ మాధవికి గ్యాప్ పెరుగుతోంది. అధికారపార్టీ ఎంపీలు సొంత వ్యాపకాలకు.. వ్యక్తిగత రాజకీయాలకు పరిమితం కావడంతో బీజేపీ మెల్లగా ఎంట్రీ ఇస్తోంది. కేంద్రమే అభివృద్ధి చేస్తోందని జనాల్లోకి వెళ్తోంది. మరి.. ఈ విషయాన్ని ఎంపీలు గమనించారో లేదో కానీ.. మిగిలిన పదవీకాలంలో ఎలా రాణిస్తారో చూడాలి.