మాస్కో, ఫిబ్రవరి 28,
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి నేపథ్యంలో ఐరోపాలోని మానవహక్కుల సంఘం నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ ఐరోపా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆస్తుల్ని స్తంభింపజేసేందుకు అమెరికా, ఈయూ అంగీకారం తెలిపాయి. ఐరోపా దేశాల్లో ఉన్న వీరిద్దరి ఆస్తుల్ని స్తంభింపజేయడానికి ఈయూ కూడా ఆమోదించింది.ఐరోపాలోని మానవ హక్కుల సంఘంలో 47 సభ్య దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా అనుచరిస్తున్న దుందుడుకు చర్యను పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జపాన్, ఐరోపా, ఆస్ట్రేలియా, తైవాన్ సహా పలు దేశాలు తీవ్రమైన ఆంక్షలకు సిద్ధమయ్యాయి. ఫ్రాన్స్ సహా దాని యూరోపియన్ మిత్రదేశాలు రష్యాపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఆర్థిక, ఇంధన, ఇతర రంగాలే లక్ష్యంగా ఆ ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మేక్రాన్ పేర్కొన్నారు. రష్యా పరిశ్రమలు, మిలిటరీని అదుపు చేసే లక్ష్యంతో సెమీ కండక్టర్లు, ఇతర హైటెక్ ఉత్పత్తుల ఎగుమతులను ఆయా దేశాలు నియంత్రిస్తున్నాయి.మరో పక్కన రష్యా బృందాలు, బ్యాంకులు, వ్యక్తుల వీసాలను జపాన్ నిలిపివేసింది. ఇతర కఠిన ఆంక్షలు కూడా విధించింది. ఈ క్రమంలోనే జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బలగాలతో ఏ దేశం సరిహద్దులను మార్చాలని చూసినా ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. రష్యా చర్య కేవలం ఐరోపానే కాక ఆసియాపైనా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.