వడ్లమూడి
సంగం డెయిరితో రైతు భాందవుడు యడ్లపాటి వెంకట్రావు అనుబంధం విడదీయరానిదని, వ్యవస్థాపక ఛైర్మన్ గా సంగం డెయిరి అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఛైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. రాజకీయ కురువృద్ధుడు, మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరమని తెలిపారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు, రైతు నాయకుడిగా వ్యవసాయ రంగం అభివృద్దికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. సంగం డెయిరి, జంపని షుగర్ మిల్లుల ఏర్పాటులో వెంకట్రావు గారి కృషి మరువలేనిదని తెలిపారు. సంగం డెయిరి వ్యవస్థాపక ఛైర్మన్ గా పనిచేశారని అన్నారు. ఆయన 14 జూన్ 1977 నుండి 31 మార్చి 1978 మధ్యకాలంలో డెయిరి ఛైర్మన్ పదవిలో కొనసాగారని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలకు సరియైన రోడ్డు సౌకర్యం లేని ఆరోజుల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, జిల్లాలోని పలు గ్రామాలలో పాల సంఘాల ఏర్పాటు చేయటం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. సంగం డెయిరి అభివృద్దికి ప్రతిక్షణం తపించిన ఆయన జిల్లాలో పాడిరైతుల అభివృద్దికి పునాదులు వేశారని చెప్పారు. 1978లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ భాధ్యతలు చేపట్టిన ఆయన సంగం డెయిరి ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన సంగం డెయిరి అభివృద్దికి తనవంతు ప్రోత్సాహాన్ని, తోడ్పాటును అందించారని తెలిపారు. తరువాత కాలంలో మాతండ్రి గారైన స్వర్గీయ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారు ఛైర్మన్ గా ఎన్నిక కావటంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారని చెప్పారు. పాడిరైతుల అభివృద్ది కోసం విలువైన సూచనలు, సలహాలు అందించి డెయిరి విస్తరణ, పాడి రైతాంగ అభివృద్దికి పాటుపడిన ఆయన మన నుండి దూరమవడం తీరని లోటని నరేంద్ర కుమార్ అన్నారు.
తెలుగుదేశం పార్టీకి క్రియాశీల నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పదవులను అధిరోహించిన ఆయన తెలుగు దేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యునిగా, తెలుగు రైతు అధ్యక్షునిగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా ,రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు,పార్టీకి విశేష సేవలందించారని నరేంద్ర కుమార్ వివరించారు. శత వసంతాలను పూర్తి చేసుకొని సుఖ సంతోషాలతో 104 ఏళ్ల నిండైన జీవితాన్ని గడిపిన ఆయన నేటితరం నాయకులకు స్పూర్తి దాయకమని అన్నారు. పాత తరం, కొత్త తరం రాజకీయ నాయకులకు ఆయన వారధి లాంటి వారని అన్నారు. వెంకట్రావు గారి మృతి రైతాంగానికి, తెలుగుదేశం పార్టీకి, వ్యక్తి గతంగా తమ కుటుంబానికి తీరని లోటని, ఆత్మ బంధువు లాంటి ఆయనను కోల్పోవటం బాధాకరమని తెలిపారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.