హైదరాబాద్ ఫిబ్రవరి 28
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. జరీన్‌కు ట్విటర్ వేదికా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 2019 స్ట్రాంజా స్మారక టోర్నీలో స్వర్ణం చేజిక్కించుకున్న ఈ ఇందూరు చిచ్చర పిడుగు.. తన పిడిగుద్దులతో మరోసారి పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. కరోనా కష్టకాలంలో పడ్డ శ్రమకు తగ్గ ఫలితం దక్కించుకుంది.బల్గేరియా వేదికగా ఆదివారం జరిగిన మహిళల 52 కేజీల ఫైనల్లో తెలంగాణ స్టార్ నిఖత్ 4-1 తేడాతో టెటియానా కోబ్ (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత బూసనాజ్‌పై గెలుపొందిన నిఖత్.. ఆఖరి పోరులోనూ అదేస్థాయి ప్రదర్శన కనబర్చింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా హుక్, క్రాస్, జాబ్ పంచ్‌లతో విరుచుకుపడింది. 48 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ నీతూ 5-0తో ఎరికా ప్రిసియాండారో (ఇటలీ)పై నెగ్గి పసిడి ఖాతాలో వేసుకుంది.