YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఉపకారమేదీ..?

 ఉపకారమేదీ..?

 విద్యార్థులకు రావల్సిన ఉపకారవేతన బకాయిలు రూ. కోట్లలో పేరుకుపోయాయి. విద్యాసంవత్సరం పూర్తయినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో యువత పరిస్థితి అయోమయంగా మారింది. కళాశాలల ఫీజు చెల్లించలేక మెస్‌ఛార్జీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. పరీక్షల సమయం కావడంతో ఫీజులు కడితేనే హాల్‌టికెట్లు ఇస్తామంటూ యాజమాన్యాలు చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

 

జిల్లాలో పరిధిలో ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌, బీఈడీ, డీఈడీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు.. ఇలా మొత్తం 185 ఉన్నాయి. 2017-18 విద్యాసంవత్సరం పూర్తయినా ఉపకార వేతనాలు (ఆర్టీఎఫ్‌, ఎంటీఎఫ్‌) మంజూరు కాలేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు మొక్కుబడిగా రూ.కోటి చొప్పున కేటాయించి వదిలేశారు. ఆ తర్వాత నిధులు విడుదల చేయలేదు. బీసీ సంక్షేమశాఖ పరిధిలో 26 వేల మంది, గిరిజన విద్యార్థులు 2 వేలు, ఎస్సీ విద్యార్థులు 8420 మంది ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. 2016-17 సంవత్సరంలో ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు 2018లో మంజూరు చేశారు. 2017-18లో ఇవ్వాల్సినవి రూ.37 కోట్లు పేరుకుపోయాయి. బీసీ విద్యార్థులకు రూ.28 కోట్లు, ఈబీసీలకు రూ.2.5 కోట్లు, ఎస్సీలకు రూ.4 కోట్లు, గిరిజనులకు రూ.2.5 కోట్లు చెల్లించాల్సి ఉంది.

 

ఉపకార వేతనాల నిధుల మంజూరులో తీవ్ర జాప్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పరీక్షల సమయంలో ఎంతో కొంత ఫీజు చెల్లిస్తేనే హాల్‌  టిక్కెట్లు ఇస్తామని కళాశాలల యజమానులు స్పష్టం చేయడంతో పేద విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మొన్నటి వరకు కార్యాలయాల చుట్టూ తిరిగి చేసేది లేక ఊరుకుండిపోయారు. పరీక్షలు ప్రారంభం కావడంతో నాయకులు, తెలిసినవారితో కళాశాల యాజమాన్యాలకు ఫోన్లు చేయించి కాళ్లావేళ్లాపడి ఫీజు చెల్లించేందుకు సమయం ఇవ్వాలని బతిమాలుకొంటున్నారు. ఇంకొందరు తల్లిదండ్రులతో హామీపత్రం రాయించి హాల్‌టిక్కెట్లు తీసుకొంటున్నారు. మరికొందరు అప్పుచేసి చెల్లించి హాల్‌టిక్కెట్లు తీసుకెళ్లారు. ఇంత అధ్వానమైన పరిస్థితి వచ్చేవరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ఉండటం సరికాదని విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం వాపోతున్నారు.

Related Posts